తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు … ఒక్క అవకాశం : రేవంత్
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ మాట్లాడుతూ పదేళ్లు కేసీఆర్కు అవకాశం ఇస్తే, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు. ఇకపై అభివృద్ధి కోసం ఎవరి దగ్గరో చేతులు చాచాల్సిన అవసరం లేదు. మన అభివృద్ధి, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. వనపర్తికి పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి. పాలమూరు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీసుకునేలా ప్రజల నిర్ణయం ఉండాలి. తెలంగాణ వస్తే రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండవు అనుకున్నాం. సింగరేణి, విద్యుత్ కార్మికులు తమ బతుకులు బాగుపడతాయని అనుకున్నారు. దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు కలలు మాత్రమే నెరవేరాయి అన్నారు.
తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు మరో అవకావం ఇచ్చే విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం అని హామీ ఇచ్చారు.













