Musi: ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్
మూసీ(Musi) నదిని అభివృద్ధి చేసి పర్యాటక, అభివృద్ధి కేంద్రంగా తయారు చేసుకోవాల్సిన అవసరముందని, సమాజ పరిణామ క్రమంలో వస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం, దానికయ్యే ఖర్చు సహా ప్రాజెక్టు వివరాలను తెలిపేందుకు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణా హోటల్లో రేవంత్ మాట్లాడారు. చరిత్రను ఇప్పుడు తిరగరాయకపోతే ఎప్పటికీ రాయలేమన్న విషయం మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్న మేధావులకు అర్ధం కావడం లేదా? అని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల కోసం చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో ఏ పేదవాడికి అన్యాయం జరగనివ్వబోమని, ఏ పేద వ్యక్తిని నిరాశ్రయుడిని చేయబోమని, ఎవరి ఆస్తులను గుంజుకోబోమని స్పష్టం చేశారు. పేదలకు నష్టం, ఇబ్బంది కలిగించడానికి గానీ, రియల్ ఎస్టేట్ (Real Estate) ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజా ప్రభుత్వం పని చేయడం లేదని తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణను గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టేందుకే పని చేస్తుందన్నారు. మూసీ పునరుజ్జీవనం విషయంలో నాకు కూడా సానుభూతి ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) పరిధిలో కాకుండా కింది భాగాన ఉన్న నల్గొండ జిల్లా గురించి ఎందుకు ఆలోచించడం లేదు? పశువుల కళేబరాలు, ఫార్మా రంగం కాలుష్యం, నగర డ్రైనేజీ నీరు, ఆత్మహత్యలు చేసుకున్న వారి కళేబరాలు తదితరాల భరించలేని కంపుతో మూసీ విషపు కూపంగా మారింది. ఇది నల్లగొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. భువనగిరి, ఆలేరు సహా నదీ ప్రాంతంలో నివసిస్తున్న ఆడపిల్లలు పెళ్లిళ్లు అయిన తరువాత ప్రెగ్నెన్సీ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలో నదీ జలాల వెంటే అభివృద్ధి జరిగిందని, లండన్లోని థేమ్స్, సింగపూర్, హాట్సన్, సబర్మతి సహా చాలా ప్రాంతాలను సందర్శించానని, వాటి స్ఫూర్తితోనే మూసీ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నా,మనం అభివృద్ధి నిరోధకులుగా మారితే, భవిష్యత్తు కోసం ఒక బృహత్ ప్రణాళిక లేకపోతే భవిష్యత్తు తరాలు క్షమించబోవని అన్నారు.








