ఆ నిర్ణయంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేకమని తేలిపోయింది: అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణలో రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పథకం పాతదేనని, అలాంటి పథకాన్ని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుందో అర్థం కావడం లేదని అన్నారు. ఇదేదో కొత్త పథకం అయితే.. కాంగ్రెస్ అడ్డుకోవడంలో అర్థం ఉందన్నారు. ‘రైతు బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం రైతులకు అందకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. ఇది చాలా ఏళ్లుగా అమల్లో ఉన్న పథకమే కదా. దీన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఇదేదో కొత్త పథకం అయితే వాళ్లు చేసిన పనికి అర్థం ఉంటుంది. కానీ ఇలా పాత పథకాన్ని అడ్డుకుందంటే.. ఆ పార్టీ రైతు వ్యతిరేకత అర్థం కావడం లేదా? ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ తప్పుడు సంకేతాలే పంపుతోంది’ అని అసదుద్దీన్ స్పష్టం చేశారు.













