మెడికల్ కాలేజీలో 12 మందికి కరోనా
ఉస్మానియా వైద్యకళాశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ తెలిపారు. ఉస్మానియాలో 296 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులంతా వసతిగృహంలోనే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం 180 మంది విద్యార్థినిలు, 116 మంది విద్యార్థులకు పరీక్షలు చేయించింది. వీరిలో ఇప్పటి వరకు 12 మందికి పాజిటివ్‌గా తేలిందని, మిగిలిన వారి ఫలితాలు బుధవారం వచ్చే అవకాశముందని ప్రిన్సిపల్ వెల్లడించారు. ఐదు రోజల క్రితం ఓయూ వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం తమకు లేదని డీఎంఈ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ ఖండించారు.













