ప్రధాని మోదీతో మంత్రి కేటీఆర్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్ ఏర్పాటును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలను త్వరగా అమలు చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హామీలు, 10 ప్రతిపాదనలను ప్రధాని ముందు ఉంచినట్లు తెలిపారు. ఐటీఐఆర్‌కు కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడులకు పెద్దయెత్తున రాయితీలు ఇస్తోందని, ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తే మరిన్ని రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వినూత్న ఆలోచనలు, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేయూతనిస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు.













