శవరాజకీయాలు చేయడం బీఆర్ఎస్‌కు కొత్తేం కాదు: మంత్రి జూపల్లి కౌంటర్

వనపర్తికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ బాబు హత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలనే రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దురలవాట్లు, భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని, అంతేకానీ అతడి హత్య వెనుక ఎలాంటి రాజకీయ కారణాలూ లేవని అన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘హత్యకు దారితీసిన పరిస్థితులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కేటీఆరే చెబుతున్నారు. అట్లాంటప్పుడు ఈ హత్యను రాజకీయ హత్య అని ఎలా అంటారు? ఇలాంటి ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం కేటీఆర్‌కే చెల్లింది. హత్య జరిగిన క్షణాల్లోనే కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులంతా రంగంలోకి దిగి ప్రభుత్వంపై, తనపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది నిజంగా దుర్మార్గం. ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేది తెలుసుకోకుండా కావాలనే నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ నీచ రాజకీయాలకు నిజంగా ఇది పరాకాష్టే’’ అంటూ మంత్రి జూపల్లి నిప్పులు చెరిగారు. అలాగే శవ రాజకీయాలు చేయడం బీఆర్ఎస్‌కు కొత్త కాదని, ఎక్కడ శవముంటే అక్కడ గద్దలా వాలి, నేరారోపణలు చేయడం బీఆర్ఎస్ వాళ్లకి అలవాటేనని జూపల్లి ఎద్దేవా చేశారు.