సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కూన వెంకటేష్ గౌడ్?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అన్ని పార్లమెంటు స్థానాల్లో బరిలో నిలుస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోకవర్గం నుంచి టీడీపీ తరపున ఎవరూ పోటీ చేయాలనే విషయంపై నగర నాయకులు రెండు రోజులుగా తీవ్ర చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్, ముఖ్య నాయకులు సారంగపాణి, బీఎన్‌రెడ్డి, భజరంగ్‌శర్మ, వనం రమేష్, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు కూన వెంకటేశ్‌గౌడ్ నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో మెజార్టీ నాయకులు వెంకటేశ్‌గౌడ్‌ను బరిలోకి దించితే బీసీల ఓట్లతో పాటు సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా టీడీపీకి ఓట్లు పడే అవకాశం ఉండడంతోపాటు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఇటు వైపు వస్తాయని భావిస్తున్నారు. అధిష్ఠానం ఎవరిని నిర్ణయించినా పోటీకి సిద్ధంగా ఉండాలని సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌రెడ్డి సైతం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.













