రాజకీయాలలో ఇవి చాలా సహజం..కేటీఆర్

ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్క పార్టీకి వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అయితే వీటిపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాజకీయాలలో ఇటువంటివి చాలా సహజమని అన్నారు. తమ పార్టీకి 24 సంవత్సరాల చరిత్ర ఉందని.. ఎన్నో ఎత్తుపల్లాలను దాటి ఈనాడు ఈ స్థితికి వచ్చామని కేటీఆర్ అన్నారు. తమ పార్టీ ప్రథమ లక్ష్యమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నెరవేరిందని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు సేవ చేసే సువర్ణావకాశం కూడా తమకు దక్కిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేసినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడుతున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ.. ఇలా పార్టీలు మారడం రాజకీయాలలో చాలా కామన్.. ప్రతి రాజకీయ పార్టీకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని అన్నారు. పార్టీ లో ఎవరు ఉన్నా లేకున్నా తాము మాత్రం ఎప్పుడూ ప్రజల సేవకి సిద్ధంగా ఉంటామని చెప్పారు.