KTR: రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే..భూపాలపల్లిలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శల దాడిని ఉధృతం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
అమలు అయ్యేదాకా వదిలిపెట్టం: అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు మొహం చాటేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. “కల్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు.. మరి ఆ బంగారం ఏమైంది?” అని ప్రశ్నించారు. హామీలను నెరవేర్చే వరకు తాము ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని, అసెంబ్లీ లోపల, బయట ప్రజల తరపున పోరాడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో డిసెంబర్లోనే వచ్చే రైతుబంధు, ఫిబ్రవరి వచ్చినా ఎందుకు రాలేదని నిలదీశారు.
జిల్లాల రద్దుపై హెచ్చరిక: భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారన్న ప్రచారంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. “జిల్లాను ఏర్పాటు చేసింది కేసీఆర్.. దానిని తీసేయడానికి నువ్వు ఎవరు? నువ్వు పెట్టినవా తీసేయడానికి?” అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా హోదాను ముట్టుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, రేవంత్ వీపు చింతపండు కావడం ఖాయమని హెచ్చరించారు.
బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం: మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రెండేళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించే వారిని, బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు













