మంత్రి జూపల్లిని వెంటనే బర్తరఫ్ చేయాలి: కేటీఆర్

వనపర్తి నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయని, ఈ హత్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లాలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న కేటీఆర్.. మీడియాతో మాట్లాడారు. ఈ హత్యలకు జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని, జూపల్లిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘‘రాష్ట్రంలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి తీసుకొచ్చారు. జనవరిలో మల్లేష్ యాదవ్, ఇప్పుడు శ్రీధర్ రెడ్డిల హత్యకు ఆయనే కారణం. నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయి. మంత్రి ప్రమేయం, ప్రోద్బలం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడే అవకాశం లేదు. కానీ జూపల్లిపై కేసు పెడితే, మంత్రి పేరు వెనక్కి తీసుకోవాలంటూ పోలీసులే ఒత్తిడి తెస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మంత్రివర్గం నుంచి జూపల్లిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఈ హత్యలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో దర్యాప్తు జరిపించాలి. ఇలాగే హత్యా రాజకీయాలు కొనసాగితే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడికి కూడా వెనుకాడం. శ్రీధర్ రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.