నా పేరుతో ఎలాంటి సంఘాలు వద్దు
తన పేరుతో ఎలాంటి సంఘాలను ఏర్పాటు చేయొద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తన పేరుతో ఏర్పాటుచేస్తున్న వివిధ సంఘాలు, యువసేనలు, అభిమాన సంఘాలకు తవనైపు నుంచి ఎలాంటి మద్దతు లేదని సృష్టం చేశారు. కేటీఆర్ యువసేన, కేటీఆర్ సేవాదళ్, కేటీఆర్ అభిమాన సంఘం వంటి పేర్లతో పలువురు సంఘాలను ఏర్పాటు చేసినట్టు, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ ఈ సంఘాల పేర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి వాటిని తాను ఏమాత్రం ఆమోదించబోనని, తనపై, పార్టీపై అభిమానంతో ఇప్పటికే పలు జిల్లాల్లో ఏర్పాటుచేసిన సంఘాలను వెంటనే రద్దు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. పార్టీపై, తనపై అభిమానం ఉంటే కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్తోగానీ, పార్టీ అనుబంధ సంఘాలతో గానీ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. కేటీఆర్ యువసేన పేరుతో పలువురు కార్యకర్తలు ఆయనను కలువగా, సంఘాన్ని రద్దు చేసుకోవాలని, టీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుకగా పాల్గొనాలని కోరారు.













