హైకోర్టు శాశ్వత జడ్జిగా జస్టిస్ శ్రీదేవి ప్రమాణం
తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. గురువారం ప్రత్యేక కార్యక్రమంలో ఆమెతో చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. ఉత్తరప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన జస్టిస్ శ్రీదేవి.. 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదనపు న్యాయమూర్తిగా ఉండగానే 2019 మేలో తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ కోదండరాం, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ విజయసేన్ రెడ్డి, పలువురు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.













