పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు : మంత్రి జూపల్లి
తెలంగాణ పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, ఆయా ప్రాంతాలకు అవసరమైన రవాణా, ఇతర మౌలిక వసతులను కల్పించాల్సి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో ప్రారంభమైన అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ను ఆయన ప్రారంభించారు. అక్కడ బోనాలను కనులపండువగా నిర్వహించారు. ఒగ్గుడోలు, ఒగ్గు కథ, కూచిపూడి, భారత న్యాట కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మంత్రి వెంట రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె. నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేశ్ నాయుడు ఉన్నారు.













