హైదరాబాద్ లో ఇంటెల్ ఏఐ పరిశోధనా కేంద్రం
టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ హైదరాబాద్‌లో అనువర్తిత కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిశోధనా కేంద్రం ఐఎన్ఏఐని ఏర్పాటు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం, ఐఐఐటీ-హైదరాబాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పిహెచ్‌ఎఫ్‌ఐ) భాగస్వామ్యంతో ఈ సెంటర్‌ను తీసుకువస్తున్నట్లు ఇంటెల్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆల్.ఏఐ 2020 వర్చువల్ సమ్మిట్ అండ్ ఏఐ ఫర్ యూత్ సింపోజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అనువర్తిత ఏఐ రిసెర్చ్ సెంటర్‌కు ఇంటెల్ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
హెల్త్‌కేర్, స్మార్ట్ మొబిలిటీ, నైపుణ్యం వంటి కీలక రంగాల్లో ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారాలపై ఈ సెంటర్ ప్రధానంగా దృష్టి పెట్టనుందని ఇంటెల్ ఈ సందర్భంగా వివరించింది. మార్పును కోరుకుంటున్న భారత్.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నది. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్ మొబిలిటీ, భవిష్యత్తులో పని పరిణామక్రమం వంటి కీలక రంగాలు, అంశాల్లో దేశం ఎదుర్కొంటున్న సామాజిక సవాళ్లను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది అని ఇంటెల్ కార్పొరేషన్ దేశీయ అధిపతి, ఇంటెల్ డేటా ప్లాట్‌ఫామ్స్ గ్రూప్ ఉపాధ్యక్షురాలు నివృతి రాయ్ అన్నారు.
పరిశ్రమ, అధ్యాపక, ప్రభుత్వ సహకారంతో ఐపీ జనరేషన్ ద్వారా అడ్వాన్స్ ఏఐ, సాంకేతిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతామన్నారు. కొత్తదనం, ఎంటర్ ప్రెన్యూర్షిప్, జాతీయ ఆస్తుల సృష్టి, క్యూరేటెడ్ డేటాసెట్స్, కంప్యూటింగ్ ఇన్ఫాస్ట్రక్చర్లతో అంతర్జాతీయంగా ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కృషి చేస్తామన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సదస్సు జరుగుతుంది. యువతకు ఏఐ నైపుణ్యంపైనా ఈ సదస్సులో చర్చిస్తారు.













