వ్యూహమా..? నిర్వేదమా..?
గెలిపిస్తే ఓకె.. లేదంటే హాయిగా రెస్ట్ తీసుకుంటా.. సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇది సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే… ఓటమి తథ్యమన్న నిస్పృహ నుంచి పుట్టుకొచ్చిన మాటలని విపక్షాలు కౌంటర్స్ వేస్తున్నాయి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ నుంచి కేసీఆర్ కు… ఓటమి తప్పదన్న రిపోర్టులు అందాయని, దాని ఫలితంగానే ఈవ్యాఖ్యలని ఆరోపిస్తున్నాయి.
ప్రతీ ఎన్నికల సమయంలో ప్రజల్ని ఎమోషనల్ చేసేలా సెంటిమెంట్ ప్రయోగించడం కేసీఆర్ విధానమని విపక్షాలు చెబుతున్నాయి. పదేళ్లతో సెంటిమెంటు పనైపోయిందని, ఇప్పుడు ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని విపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసీఆర్ పప్పులు ఈసారి ఉడికే ప్రసక్తే లేదంటున్నారు.
ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ ను అభ్యర్థించారు. తమ ముఖాలను చూసి ప్రజలు ఓటేయరని, కేసీఆర్ ను చూసి ఓటేస్తారని ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ బహిరంగంగానే చెప్పారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫ్ దారుణంగా పతనమైందని.. ఇప్పుడు పార్టీని రక్షించేబాధ్యత కేసీఆర్ పైనే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే.. తాము అమలు చేస్తున్న పథకాలు ఆగకుండా చూడాల్సిన బాధ్యత.. ప్రజలపైనే ఉందని స్వయంగా కేసీఆర్ చెబుతున్న విషయాల్ని ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ సైతం, సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు నియోజకవర్గాలను టార్గెట్ చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను బరిలోకి దించేలా ప్రయత్నాలుచేస్తున్నారు. కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో పటిష్ట అభ్యర్థులను బరిలోకి దించడంతో పాటు మంత్రులకు షాకిచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు కాంగ్రెస్ గట్టి అభ్యర్థులను బరిలోకి దించడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం కూడా కేసీఆర్ వ్యాఖ్యల వెనక కారణాలుగా భావిస్తున్నారు.













