ప్రజారోగ్యం గాలికిః తెలంగాణ హైకోర్టు
కరోనా నియంత్రణ చర్యలపై మరోసారి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెరాస ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసినట్టుగా కనిపిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సోమవారం కరోనా నియంత్రణపై హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు పలు సందర్భాల్లో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదేమిటని సూటిగా ప్రశ్నించింది. ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేసులు పెట్టి సస్పెండ్ ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించింది. టెస్టులు, పరిస్థితులపై సరైన సమాచారం ఇవ్వడం లేదని నిలదీసింది. బులెటిన్లలో తాము ప్రభుత్వాన్నిఅభినందించామంటూ తప్పుడు సమాచారం ఎందుకిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రుల వారీగా బెడ్లు, వెంటిలేటర్లపై వివరాలు వెల్లడించడం లేదని, బులెటిన్లలో ఇప్పటికీ సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని తప్పు బట్టింది. తాము పదే పదే ఆదేశాలు ఇస్తున్నా అవి ఎందుకు అమలుకు నోచుకోవడం లేదో చెప్పాలని నిలదీసింది. తాజాగా హైకోర్టు వ్యక్తం చేసిన ఆగ్రహంతో ప్రభుత్వం మరోసారి ఆత్మరక్షణలో పడినట్టయింది.













