ఒకరోజు ముందు చెబితే నష్టమేందో? హైకోర్టు సూటి ప్రశ్న

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏంటని సూటిగా ప్రశ్నించింది. కరోనా నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు ఏం తీసుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపైనే హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటని మండిపడింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అయితే తదుపరి ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై మధ్యాహ్నం కల్లా తెలియజేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
భూమిపైనే ఉన్నారా? ఆకాశంలోనా?
హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘంపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు ముందుకు వెళ్లారని నిలదీసింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని ప్రశ్నించింది. ఆకాశం విరిగి మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా? అని నిలదీసింది. ఫిబ్రవరిలోనే కరోనా రెండో దశ మొదలైనా, ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఎందుకిచ్చారని సూటిగా ప్రశ్నించింది.