గవర్నర్ తనిఖీ…
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ సంచాలన్ భవన్ కార్యాలయాన్ని బుధవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సందర్శించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య రాష్ట్ర గవర్నర్‌ను సాదరంగా ఆహ్వానించారు. ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్ మధుసూదన రావు, సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం ఆనంద్ భాటియా ఇతర ఉన్నతాధికారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన రైళ్ల నిర్వహణను నియంత్రించే వ్యవస్థ కంట్రోల్ ఆఫీసును గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తనిఖీ చేశారు. ఈ కంట్రోల్ కార్యాలయంలో ట్రాక్షన్ పవర్ కంట్రోల్ సిస్టమ్, ఇంజనీరింగ్ మెకానికల్, సెక్యూరిటీ కమర్షియల్ కంట్రోల్ మొదలైన వ్యవస్థలను పరిశీలించారు. రైళ్ల నిర్వహణకు సంబంధించిన విషయాలను రైల్వే అధికారులు వివరించారు.













