కిషన్ రెడ్డితో మాట్లాడిన ఈటల.. బీజేపీలో చేరికకు సిద్ధమేనా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ఈయనతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఇదే విషయంపై ఈటలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి రావాలంటూ ఈటలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. అయితే.. తన నిర్ణయాన్ని అనుచరులు, ముఖ్య నేతలతో చర్చించి, నిర్ణయం తీసుకుంటానని ఈటల కిషన్ రెడ్డితో అన్నట్లు సమాచారం. ఈ భేటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎంపీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం హైదరాబాద్ శివారులోని ఓం ఫాంహౌజ్‌లో జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కుడిభుజం, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈయన తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇన్‌చార్జీగా కూడా పనిచేశారు. భూపేందర్ యాదవ్ సమక్షంలోనే బీజేపీలో చేరాలని ఈటలకు కిషన్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ అన్ని పార్టీలకు చెందిన నేతలతో భేటీ అవుతూ వస్తున్నారు. వారి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో ఈటల భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాతే ఈటల బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈటల మనసు ఎరిగిన మరుక్షణమే జితేందర్ రెడ్డి కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించి, ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు కొందరు అంటున్నారు. జితేందర్ రెడ్డి కూడా గతంలో టీఆర్‌ఎస్‌లో పనిచేశారు. ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా దాని కంటే ముందు బీజేపీలో కూడా పనిచేశారు. ప్రధాని మోదీకి సన్నిహితుడిగా మెలిగారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని బీజేపీ అధిష్ఠానం జితేందర్ రెడ్డికి ఈటల వ్యవహారాన్ని అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై ఈటల రాజేందర్ అందరితో సంప్రదించి తుది నిర్ణయం ప్రకటిస్తానని పేర్కొన్నట్లు సమాచారం.
ఈటల రాజేందర్ భూ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌తో ఆయనకు పొసగడం లేదు. మంత్రి పదవి నుంచి సీఎం కేసీఆర్ ఈటలను బర్తరఫ్ చేశారు. దీంతో ఆయన కొత్త పార్టీ స్థాపిస్తారన్న ప్రచారం బాగా జరుగుతోంది. కాదు.. కాదు… కాంగ్రెస్‌లో చేరిపోతారన్న ప్రచారమూ సోషల్ మీడియాలో జరిగింది. కానీ తాజాగా బీజేపీలో చేరుతున్నారన్న వార్త వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈటల రాజేందర్ వామపక్ష భావజాల రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి. విద్యార్థి దశ నుంచే ఆయన వామపక్ష రాజకీయాల్లో మెలిగిన వారు. విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన వామపక్ష విద్యార్థి సంఘంలో ఉన్నారు. అలాంటి రాజకీయ నేపథ్యమున్న రాజేందర్ ప్రస్తుతం రాజకీయ వైరుధ్ధ్యమున్న బీజేపీలో చేరతారా? అన్నది ఆసక్తిదాయకం.
అయితే కార్యక్షేత్రంలో అంతగా బలం లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎదగాలని బలంగా కోరుకుంటోంది. పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే, ఇతర పార్టీల్లో ఉన్న సమర్థులను బీజేపీలోకి తీసుకురావాలన్న వ్యూహం ప్రకారం బీజేపీ పనిచేస్తోంది. ఈ వ్యూహం కేంద్రహోం మంత్రి అమిత్‌షాది. అసోంలో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వశర్మ పూర్వాశ్రమం కాంగ్రెస్. కాంగ్రెస్‌తో కలిసిరాక, ఆయన బీజేపీలో చేరారు. కాంగ్రెస్ ముక్త్ భారత్‌లో భాగంగా బీజేపీ ఆయన్ను చాలా వినియోగించుకుంది. బెంగాల్‌లో కూడా అంతే. ముకుల్ రాయ్, సుబేందు అధికారితో పాటు మరికొందర్ని బీజేపీ ఆకర్షించింది. వారిని ఆకర్షించి, బెంగాల్‌లో తన పునాదులను పటిష్ఠం చేసుకుంది. అవసరానికి తగ్గట్లు అన్నట్లు పక్కనున్న ఏపీలో కూడా అంతే. సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్‌తో పాటు మరి కొందర్ని బీజేపీ ఆకర్షించింది. తెలంగాణలో కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. కేసీఆర్ లాంటి నేతను ఢీకొని, తమ పునాదులను పటిష్ఠం చేసుకోవాలంటే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిని ఆకర్షించాలన్నది బీజేపీ జాతీయ నాయకత్వం ప్లాన్. అందులో భాగంగానే ఈటల రాజేందర్‌ను తమ వైపు మల్చుకోవాలని బీజేపీ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.