బీఆర్ఎస్ దూకుడుకు బ్రేకులు వేయడంలో కాంగ్రెస్ ఫెయిల్?
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఆ పార్టీ దూకుడును అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదవుతున్న కేసులు కోర్టుల్లో నిలవట్లేదు. బలమైన సెక్షన్లు నమోదు చేయకపోవడంతో కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి. ఇది అధికార పార్టీ వర్గాల్లో తీవ్ర కలవరం రేపుతోంది. రాజకీయ ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ వ్యూహాలు అడుగుడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తమను అప్పటి ప్రభుత్వం ఎలా వేధించిందో, ఎన్నిసార్లు జైలుకు పంపిందో కాంగ్రెస్ నేతలు పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో ప్రతిపక్ష నేతలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని, ఇతర ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై అధికార పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
అయితే.. పోలీసులు నమోదు చేస్తున్న కేసుల్లో గట్టి సెక్షన్లు ఉండటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నామమాత్రపు సెక్షన్ల కారణంగా నిందితులు సులభంగా కోర్టుల నుంచి ఊరట పొందుతున్నారు. జ్యుడీషియల్ రిమాండ్ దక్కకపోగా, కొద్ది గంటల్లోనే బెయిల్ పై బయటకు వస్తున్నారు. ఇది కాంగ్రెస్ శ్రేణులను నిరుత్సాహపరుస్తోంది. పోలీసుల తీరుపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కఠినమైన పోలీసు చర్యలను ఎదుర్కొన్నామని.. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలపై అలా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటనే అభద్రతాభావం కొందరు నేతల్లో కనిపిస్తోంది.
పోలీస్ యంత్రాంగం సరైన లీగల్ సెక్షన్లను ప్రయోగించడంలో విఫలమవుతోందని, దీనివల్ల అధికార పార్టీ పరువు పోవడంతో పాటు ప్రత్యర్థులకు రాజకీయ మైలేజీ దక్కుతోందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఫిర్యాదులు ఇస్తున్నప్పటికీ, తగిన ఆధారాలతో కూడిన పటిష్టమైన ఎఫ్ఐఆర్లు నమోదు కాకపోవడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని వాపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కీలక చర్చ జరుగుతోంది. ఎంతమందిపై కేసులు పెట్టామనేదాని కంటే, పెట్టిన కేసులు ఎంత బలంగా ఉన్నాయనే దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. సోషల్ మీడియా పోస్టులు లేదా వ్యక్తిగత విమర్శల విషయంలో ప్రత్యర్థులను న్యాయపరంగా గట్టిగా నిలువరించాలంటే మరింత లోతైన లీగల్ రీసెర్చ్, పకడ్బందీ చట్టపరమైన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఎదుటివారి దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో ప్రస్తుత వ్యూహాత్మక లోపాలను సరిదిద్దకపోతే, అది రాబోయే కాలంలో పార్టీకి మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. ఏది ఏమైనప్పటికీ, చట్టపరమైన చిక్కులను అధిగమించి బీఆర్ఎస్ దూకుడును కట్టడి చేయడం కాంగ్రెస్ సర్కార్‌కు ప్రస్తుతం పెద్ద సవాల్‌గా మారింది.








