కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం రేవంత్ భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఈ సమావేశం జరిగింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 2019-20, 2021-22 నుంచి 2023-24 వరకు ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున విడుదల చేయాల్సిన మొత్తం రూ.1,800 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,233.54 కోట్ల నిధులను కూడా త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర అభివృద్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.













