తెలంగాణ చరిత్ర పుస్తక సంపుటాలను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైందని, కోట్ల సంవత్సరాల చరిత్రకు రాష్ట్రం సాక్ష్యంగా నిలవడం ఆనందాన్నిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో రాష్ట్ర చరిత్రను భావితరాలకు తెలిపేలా భారత జాగృతి సంస్థ ప్రచురించిన తెలంగాణ చరిత్ర పుస్తకం అయిదు సంపుటాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం నాటి చారిత్రక ఆనవాళ్లు రాష్ట్రంలో లభ్యం కావడం గర్వకారణమని తెలిపారు. ఈ దిశ తెలంగాణ చరిత్ర కారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆయా కాలాల్లోని సామాజిక పరిస్థితులు, పరిపాలన రీతులు, దార్శనికతలను అర్థం చేసుకుంటే, భవిష్యత్తుకు మనకు దారి చూపుతాయన్నారు. జాగృతి చరిత్ర విభాగం బాధ్యులను, జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో రచయిత రామోజు హరగోపాల్, కవి, సంపాదకుడు వేముగంటి మురళీకృష్ణ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.













