పూర్ణాహుతితో ముగిసిన రాజశ్యామల యాగం
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్వహించిన రాజ శ్యామల యాగం ముగిసింది. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండురోజులపాటు నిర్వహించిన ఈ యాగం సోమవారం పూర్ణాహుతితో ముగిసింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని ఈ యాగం తలపెట్టారు. రాష్ట్ర అభివృద్ధికి తలపెట్టిన కార్యాలు పరమేశ్వరుడి దయతో దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాజశ్యామల యాగంలో భాగంగా అన్ని హోమాలు విశాఖ శారదాపీఠాథిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో సాగాయి. ఈ యాగంలో పాల్గొన్న రుత్విక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించారు. ముఖ్యమంత్రి సతీమణి శోభ ఇతర కుటుంబసభ్యులతో పాటు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే మేముల ప్రశాంత్‌రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.













