ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజు కొనసాగింది. యాగంలో ఈ రోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహించారు. కేసీఆర్ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొన్నారు. విశాఖ శారద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు యాగ క్రతువును పర్యవేక్షించారు. యాగశాలలో ఈరోజు రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. యాగంలో మొత్తం మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేశారు. సర్వలోక సంరక్షణార్థం ఇంద్ర సూక్త హోమం, నవగ్రహ సూక్త హోమం నిర్వహించారు. షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం కూడా నిర్వహించారు.













