సిద్దిపేట తెలంగాణకు గరిమనాభి : సీఎం కేసీఆర్

సిద్దిపేట తెలంగాణకు గరిమనాభి అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభివర్ణించారు. సిద్దిపేట అనేది సెంట్రల్ తెలంగాణ అని, రాజధాని హైదరాబాద్‌లో ఉన్నా, సిద్దిపేటనే సెంట్రల్ తెలంగాణ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సిద్దిపేటలో పర్యటించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. తదనంతరం జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభమైందని, తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట మూలస్తంభంగా, అండంగా నిలిచిందని కొనియాడారు. సిద్దిపేట జిల్లాలోనే తాను పుట్టి పెరిగానని, తాను పుట్టిన ఊరు ఇంతగా అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట సెంట్రల్ తెలంగాణ కాబట్టే… రానూ రానూ మరిన్ని పథకాలు, నిధులు కూడా వస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతాన్ని గుర్తు చేసుకుంటూ… ‘‘అప్పట్లో తాగు, సాగు నీటి కోసం సిద్దిపేట ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు తీసుకొని, ట్యాంకర్లతో నీటిని అందించేవారం. ఆరోజులు తలుచుకుంటే ఇప్పటికీ భయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని, నిండుగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయని, హల్దీ, కూడవెళ్లి వాగులు ఏప్రిల్, మే మాసాల్లోనూ పొంగిపొర్లుతున్నాయని అన్నారు. వీటి కోసమే తెలంగాణను సాధించుకున్నామని, ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
ధరణితో భూ సమస్యలకు చెక్
ధరణి వెబ్‌సైట్‌తో భూముల సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టామని పేర్కొన్నారు. ఒక్క ధరణి పోర్టల్ కోసం మూడేళ్ల పాటు నిరంతరాయంగా శ్రమించామని సీఎం తెలిపారు. ప్రస్తుతం ధరణి ద్వారా 6 లక్షల రిజర్వేషన్లు జరిగాయని, ధరణిలో నమోదైన భూమి హక్కులను తొలగించే అధికారం ఎవ్వరికి లేదని స్పష్టం చేశారు.
రైతు బంధు అందుకే ప్రారంభించాం…
రైతులకే నేరుగా డబ్బు అందాలన్న లక్ష్యంతో, వారి అవసరాలను వారు తీర్చుకునేందుకే తాము రైతుబంధు పథకాన్ని తెచ్చామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతు ఇష్టానుసారం ఖర్చు చేసుకోవాలన్న దాని నుంచే రైతు బంధు పుట్టిందన్నారు. ఈ పథకం రైతులకు బాగానే ఉందని, ఇతరులకు మాత్రం నచ్చడం లేదని పరోక్షంగా ప్రతిపక్షాలను విమర్శించారు. ఈ పథకంపై 15,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, మధ్యన దళారీలు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకే పడుతుందని వెల్లడించారు. ఎంత సేపటికీ సంప్రదాయ పంటలు కాకుండా, ఇతర పంటలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. గుజరాత్, తమిళనాడులో పత్తి బాగా పండుతోందని, ప్రపంచంలో పండే 4 రకాలైన మేలైన పత్తిలో తెలంగాణలో కూడా ఓ పత్తి పంట పండుతోందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులు గతంలో కంటే పెరిగాయని, మరిన్ని పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో 50 జిమ్మింగ్ మిల్లులు ఉంటే, ఇప్పుడు 400 కు పెరిగిందని అన్నారు.
పాలనా సంస్కరణలో భాగంగానే కొత్త జిల్లాలు…
పాలనా సంస్కరణల్లో భాగంగానే రాష్ట్రంలో 33 నూతన జిల్లాలను ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. పాలనా సంస్కరణలు ప్రజలందరికీ అందాలన్నదే తమ లక్ష్యమని, ఒక్క తప్పు అడుగు వేస్తే… భవిష్యత్ తరాలు నష్టపోతాయని తెలిపారు. అందుకే పరిపాలనపై ప్రత్యేక దృష్టి నిలిపామని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల వారూ సంతోషంగా ఉండాలని, శరీరంలో ఏ ఒక్క భాగం బాగోలేకపోయినా… బాధపడినట్లే… సమాజంలో ఏ ఒక్కరూ బాధపడుతున్నా, అందరూ బాధపడాల్సి ఉంటుందని వివరించారు. అలా బాధగా ఉండటం ధర్మం కూడా కాదని, అందరూ బాగుండాలని అన్నారు. ఇందులో భాగంగానే ‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్’ పథకం కింద ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని సీఎం వివరించారు.