మలేషియాలో త్వరలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పూర్తి
- మహేశ్ బిగాలా, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్
మలేషియా రాజధాని కౌలాలంపూర్ నగరంలో ప్రతిష్టాత్మక MECC కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా పూర్తయ్యాయి. బీఆర్ఎస్ మలేషియా శాఖ మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ప్రతినిధులతో కలిసి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా గారు వేడుకల తుది ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కౌలాలంపూర్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ప్రవాస తెలంగాణ వాసులు, బీఆర్ఎస్ శ్రేణులు వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం పలికారు. కేటీఆర్ పర్యటనతో స్థానిక తెలుగు సమాజంలో సరికొత్త రాజకీయ, సాంస్కృతిక ఉత్సాహం నెలకొంది.
గత ఏడాది అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అదే శైలిలో ఉత్సాహంతో ఈసారి మలేషియాలో కూడా గ్లోబల్ ఈవెంట్‌ను సక్సెస్ చేసేందుకు అన్ని కమిటీలు సిద్ధమయ్యాయని మహేశ్ బిగాలా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులంతా కలిసి ఒకే వేదికపై సాంస్కృతిక ఐక్యతను చాటేలా ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశామని, కేటీఆర్ రాకతో ఇక్కడి ప్రవాసుల ఆత్మీయ బంధం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
మలేషియా తెలుగు అకాడమీ ప్రత్యేక ఆహ్వానం
ఈ పర్యటనలో భాగంగా మలేషియా తెలుగు అకాడమీ ప్రత్యేక ఆహ్వానం మేరకు కేటీఆర్ గారు సదరు అకాడమీని సందర్శించనున్నారు. మలేషియాలో దాదాపు 1955వ సంవత్సరం నుండి స్థిరపడిన సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు కుటుంబాలతో పాటు, స్వరాష్ట్ర సాధన కోసం ప్రారంభం నుంచే గళమెత్తిన పలువురు స్థానిక ప్రముఖులు ఈ సంబరాలలో భాగస్వాములు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కేసీఆర్ అద్భుత నాయకత్వానికి మలేషియా ప్రవాసుల నుండి విశేష మద్దతు లభించిందని మహేశ్ బిగాలా గుర్తుచేశారు. ఇప్పుడు వారి సంస్కృతిని గౌరవిస్తూ వస్తున్న కేటీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినేందుకు ప్రవాస జనం భారీగా ఎదురుచూస్తున్నారు.
తరలివస్తున్న సింగపూర్, ఆస్ట్రేలియా ప్రతినిధులు
ఈ వేడుకల కోసం పొరుగు దేశమైన సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్ఆర్ఐ నాయకులు, తెలుగు సమాజ సభ్యులు హాజరవుతున్నారు. వారితో పాటు ఆస్ట్రేలియా ఆగ్నేయాసియా పరిసర దేశాల నుంచి కూడా తెలంగాణ వాసులు కౌలాలంపూర్‌కు భారీగా తరలివస్తున్నారు.
రాజకీయ, సాంస్కృతిక ప్రముఖుల హాజరు:
కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణ నుండి ఇప్పటికే పలువురు కీలక నేతలు మలేషియా చేరుకున్నారు. వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎం. జగదీశ్వర్ రెడ్డి, ఎల్. రమణ, పార్టీ ప్రధాన కార్యదర్శి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు ఉన్నారు.
ఈ వేడుకలను పక్కా తెలంగాణ స్టైల్లో ధూమ్ ధామ్‌గా నిర్వహించేందుకు రాష్ట్రం నుండి ప్రసిద్ధ సాంస్కృతిక కళాకారులు పెద్ద ఎత్తున కౌలాలంపూర్ చేరుకున్నారు. బీఆర్ఎస్ మలేషియా విభాగం, మైటా కమిటీలు సమన్వయంతో పనిచేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో విజయవంతం చేస్తున్నాయని మహేశ్ బిగాలా స్పష్టం చేశారు.








