ఆ పార్టీ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి.. రైతులు అరేబియా సముద్రంలోకి
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆ పార్టీని గెలిపిస్తే దళారీ రాజ్యం వస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ కృషి చేస్తోందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో నిజాంసాగర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ముంచింది. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్వ వైభవం తెచ్చింది. ఇది మీ కళ్ల ముందున్న సాక్ష్యం. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచన చేసిందా? ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శిస్తున్నారు. రైతుబంధు దుబారానా? ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి ఎలా వస్తాయి? రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ దుబారా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే రైతులకు 3 గంటల కరెంటుతో సరిపెడతారు. అభ్యర్థుల గుణగణాలను ప్రజల దృష్టిలో ఉంచుకోవాలి. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని అన్నారు.













