బీఆర్ఎస్తో కలిసి సీఎం రేవంత్ సొంత దుకాణం.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్

బీఆర్ఎస్‌కు బీ-పార్టీ కాంగ్రెస్ అంటూ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌తో పోరాడుతున్నామా..? స్నేహం చేస్తున్నామా..? అర్థమయ్యేది కాదని, గులాబీ పార్టీని ఎదిరించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మట్లాడిన ఏలేటి.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసే పోటీ చేస్తాయంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయని జోస్యం కూడా చెప్పారు. ‘‘బీఆర్ఎస్‌తో కలసి సొంత దుకాణం పెట్టుకోవటానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారు. త్వరలో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్‌తో చేతులు కలుపుతారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఢీకొట్టే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. అది కేవలం బీజేపీకి మాత్రమే ఉంది’ అని ఏలేటి చెప్పారు.
అంతేకాకుండా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నిర్మల్ నియోజకవర్గంలో పార్టీ కోసం ఎంతో పాటుపడ్డానని, కాంగ్రెస్ కు మనుగడ లేకపోయినా పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ నిబద్ధత గల కార్యకర్తగా పనిచేశానని అన్నారు. అయితే ఇప్పుడు తాను పార్టీ నుంచి వచ్చేసిన తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అయిందని, ఇప్పుడు ఆ పార్టీని ఆదరించేవారే లేరని ఎద్దేవా చేశారు.
మహబూబ్‌నగర్ ఎంపీ సీటు ఓడిపోతున్నట్లు రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారని, సొంత పార్టీ వాళ్ళ వల్ల రేవంత్ అభద్రతా భావంలో ఉన్నారని పేర్కొన్న ఏలేటి.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో పీసీసీ పదవి కోసం పది మంది నేతలు పోటీ పడుతున్నారని, అలాగే పార్టీలో భట్టిని పక్కన పెట్టేందుకూ ప్రయత్నాలూ జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్‌లో ఎల్లో, పింక్, గాంధీ కాంగ్రెస్ ఉన్నాయంటూ ఆరోపించిన ఎలేటి.. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.