పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలం
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు 1.5 లక్షల ఎకరాలకు పైగా భూములు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. వాటికి సంబంధించిన సమగ్ర వివరాలనూ అందించింది. తమకు భారీ భూబ్యాంకు ఉందని, విదేశాల నుంచి వచ్చే పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ అన్ని విధాల అనుకూలమని సైతం పేర్కొంది. కరోనా నేపథ్యంలో చైనా నుంచి భారత్కు పరిశ్రమలను తరలించేందుకు పెట్టుబడి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయనే సంకేతాలుండడంతో అందుకు అవసరమైన సన్నాహాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి నివేదికలను కోరింది. ఈ క్రమంలో సమగ్ర వివరాలను అందజేయాలంటూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. భూముల లభ్యతతో పాటు వాటికి ఉన్న సౌలభ్యం, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు అవి ఎంత సమీపంలో ఉన్నాయి. తదితర వివరాలనూ ఇవ్వాలని అందులో ప్రస్తావించింది. కేంద్ర లేఖ నేపథ్యంలో తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)ను భూములపై నివేదిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణగా టీఎస్ఐఐసీ సిద్ధం చేసినా నివేదికను కేంద్రానికి పంపింది.
రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల మేర భూములు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఔషధనగిరి, దండుమల్కాపూర్ పారిశ్రామిక పార్కు తదితర ప్రాజెక్టులను కేటాయించినవి గాక మిగిలిన భూముల వివరాలను అందులో పొందుపరిచింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కలిపి 50 శాతం భూములుండగా, మిగిలిన 24 జిల్లాలో మరో 50 శాతం భూములు పారిశ్రామిక అవసరాలకు అనువుగా ఉన్నాయని వెల్లడించింది. సుమారు 80 వేల ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయానికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు తెలిపింది. ఆయా భూమలన్నీ రైల్వేమార్గాలకు సగటున 42 కిలోమీటర్ల దూరం లోనే అందుబాటులో ఉన్నాయి. హైటెన్షన్ విద్యుత్లైన్లకు సగటున కిలోమీటర్, తాగునీటి పైపులైన్లకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మొత్తం భూముల్లో 39 శాతం మైదాన ప్రాంతాల్లో పరిశ్రమలను వెంటనే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగలినవి ఎత్తుపల్లాలతో కూడి ఉన్నాయని వివరించింది.













