యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి : ఉపరాష్ట్రపతి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఓ సముద్రం లాంటి వారని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సికింద్రాబాద్‌లోని మారియట్ హోటల్లో నిర్వహించిన వాజ్‌పేయి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాజ్‌పేయితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి లోతైన ఆలోచనలను కొన్నిసార్లు అర్థం చేసుకోవడం చాలాకష్టతరంగా ఉండేదని చెప్పారు. భాష, సాహిత్యం, తదితర విషయాల్లో ఆయన ప్రతిభ అమోఘమని కొనియాడారు. ప్రతి అంశాన్ని సాధారణ వ్యక్తి సైతం అర్థమయ్యేలా మనసుకు హత్తుకునేలా చెప్పడం ఆయనకే సాధ్యమని అన్నారు. వాజ్‌పేయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.













