బీజేపీకి ‘కొండా’ గుడ్ బై చెప్పడం ఖాయమా…?
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. వ్యాపారవేత్త నుంచి రాజకీయ నేత అవతారం ఎత్తిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒకప్పుడు అత్యంత ధనిక రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఆయన తర్వాత చాలా మంది ధనికులయ్యారు. అది వేరే సంగతి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాజకీయాల పట్ల ఆసక్తితో పాలిటిక్స్ లోకి వచ్చారాయన. 2014లో బీఆర్ఎస్ తరపున చేవెళ్ల పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా ఇమడలేక బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇప్పుడు అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ బీజేపీలో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితుల్లో ఉందన్నారాయన. బీఆర్ఎస్ – బీజేపీ ఒక్కటే అనే ఫీలింగ్ చాలా మందిలో ఉందని.. అలాంటి అపవాదు పోవాలంటే కవిత అరెస్టు జరిగి తీరాలన్నారు. గల్లీలో రెండు పార్టీలు కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని చాలా మంది నమ్ముతున్నారని.. కవిత అరెస్టు కాకపోవడానికి కూడా అదే కారణమనే ఫీలింగ్ చాలా మందిలో ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆ కారణం వల్లో పొంగులేటి, జూపల్లి లాంటి వాళ్లు బీజేపీలో చేరేందుకు సంకోచిస్తున్నారని చెప్పారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో .. ముఖ్యంగా బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే బీజేపీ డీలా పడింది. ఈ సమయంలో కొండా వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి. కర్నాటకలో బీజేపీ గెలవకపోతే చాలా మంది నేతలు గోడ దూకడం ఖాయమనే ప్రచారం ముందు నుంచే సాగుతోంది. అలాగే బీజేపీలో చేరాలనుకున్న నేతలు కూడా వెనక్కు తగ్గొచ్చని భావించారు. ఇప్పుడు అదే జరుగుతోంది. పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరబోవట్లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తేల్చేశారు. అలాగే తనలాంటి చాలా మంది నేతలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే సంకేతాలిచ్చారు.
కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో కూడా జోష్ తీసుకొచ్చింది. బీజేపీని ఇక్కడ కూడా కొట్టేయగలమనే ధీమా ఇక్కడి కాంగ్రెస్ లో కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కాస్త అనుమానాస్పదంగా కనిపించిన కాంగ్రెస్ శ్రేణులన్నీ ఇప్పడు ఆనందంతో ఉన్నాయి. పార్టీ వీడిన నేతలంతా తిరిగి వచ్చేయాలని ఇటీవల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విభేదాలను పక్కన పెట్టి అధిష్టానం చెప్పినట్లు పని చేస్కుంటూ వెళ్దామని సూచించారు. దీంతో చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జూపల్లి లాంటి నేతలు కాంగ్రెస్ లో త్వరలోనే చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.













