ఈటల, కోమటిరెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పేసినట్లేనా..?
తెలంగాణ బీజేపీ పరిస్థితి ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. నిన్నమొన్నటి వరకూ ఫుల్ జోష్ లో కనిపించిన ఆ పార్టీ ఇప్పుడు బాగా డీలా పడింది. కచ్చితంగా కేసీఆర్ ను ఓడించబోతున్నామని ఇన్నాళ్లూ చెప్తూ వచ్చింది. అందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి నేతలు కమలం పార్టీలోకి వెళ్లారు. దీంతో ఎన్నికల నాటికి బీఆర్ఎస్ తో బీజేపీ బలంగా ఢీకొంటుందని, కాంగ్రెస్ పనైపోయిందని అందరూ అనుకున్నారు. కానీ కర్నాటక ఎన్నికల ఫలితాలు కమలం పార్టీని తీవ్ర నిరాశలో ముంచేశాయి. ఆ పార్టీలో చేరిన నేతలంతా ఇప్పుడు డైలమాలో పడ్డారు. అలా డైలమాలో ఉన్న నేతల్లో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతలు కూడా ఉన్నారు. త్వరలోనే వీళ్లు గోడ దూకడం ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అంసతృప్త నేతలందరికీ బీజేపీకి సరైన ప్రత్యామ్నాయంగా కనిపించింది. అందుకే చాలా మంది నేతలు కమలం కండువా కప్పుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలో కూడా బండి సంజయ్ దూకుడుగా వెళ్తుండడంతో కొద్దిగా కష్టపడితే కేసీఆర్ ను ఓడించవచ్చనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపించేది. అలా ఆశించి బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చారు ఈటల రాజేందర్. పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఈటల ఘన విజయం సాధించడంతో ఆయన పరపతి బాగా పెరిగింది. హైకమాండ్ కూడా ఈటలకు మంచి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి విషయానికి ఈటల రాజేందర్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల అంతర్గత విభేదాలు ఈటల రాజేందర్ కు ఏమారం నచ్చలేదు. పైగా బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీమ్ అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుండడంతో వీటిపై క్లారిటీ తీసుకోవాలనుకున్నారు. ఇదే అంశాలపై ఆయన హైకమాండ్ ను అడిగారు. అయితే అలాంటిదేమీ లేదని త్వరలోనే పార్టీ పరంగా చాలా మార్పులు జరుగుతాయని చెప్పుకొచ్చారు.
ఈటలను అధ్యక్షుడిగా కానీ, ప్రచార కమిటీ ఛైర్మన్ గా కానీ నియమించవచ్చనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం రావడంతోనే బండి సంజయ్ అనుకూల వర్గం ఈటలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టింది. దీంతో ఈటలకు పదవి దక్కలేదు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి మరో రకం. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అనవసరంగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చి మునుగోడు ఉపఎన్నికకు కారణమయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరి ఉపఎన్నిక బరిలో నిలిచారు. అయితే ఆ ఎన్నికలో ఆయన ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆయన ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఉన్న పదవి కూడా కోల్పోయారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ నిలుస్తుందనుకుంటే ఆయనకు బీ టీమ్ లాగా మారిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ఇవాల్టి నుంచి బీజేపీ ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇద్దరూ దూరంగా ఉన్నారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరినప్పటి నుంచి నిర్దేశించిన ఏ కార్యక్రమంలో అయినా తప్పకుండా పాల్గొంటూ వచ్చారు. ముందుండి నడిపిస్తూ వచ్చారు. కానీ ఈ కార్యక్రమానికి మాత్రం దూరంగా ఉండిపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పెద్గగా పాల్గొనట్లేదు. ఇప్పుడు వీళ్లిద్దరూ పార్టీ మారడం ఖాయమనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈటల రాజేందర్ కు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆహ్వానం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైంది.













