ప్రతిపక్ష నేత పదవి మాకే ఇవ్వండి
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఇంకెంతమాత్రం రెండో పెద్ద పార్టీ కానందున తమ పార్టీకే ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీకి ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని స్పీకర్ను కోరనున్నట్టు తెలిపారు. అసెంబ్లీలో తమకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నందున రెండో పెద్ద పార్టీగా గుర్తించాలని అన్నారు. ఢిల్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకు బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నేత పదవి కోరేందుకు త్వరలోనే తాము తెలంగాణ స్పీకర్ను కలుస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్లో కలిసిపోయిన నేపథ్యంలో ఒవైసీ తాజా డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది.













