కర్ణాటకలో రాహుల్ కొత్త ప్రచారం.. ఆర్టీసీ బస్సులో మహిళలతో మాటామంతీ!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ ప్రచారం ముగుస్తుంది. దీంతోనే వీలైనంతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తనదైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో పలు సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించిన ఆయన.. ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆదివారం నాడు స్కూటీపై డెలివరీ బాయ్‌తో కలిసి వెళ్లి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మరో అడుగు ముందుకేసి బెంగళూరు సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
కన్నింగ్ హామ్ రోడ్డులో ఉన్న‘కేఫ్ కాఫీ డే’లో కాఫీ తాగిన ఆయన బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్ స్టాప్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న కాలేజీ స్టూడెంట్లు, మహిళా ఉద్యోగులతో మాట్లాడారు. అనంతరం వారితో కలిసి బస్సు ప్రయాణం చేశారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, గృహలక్ష్మి పథకం, బీఎంటీసీ, కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీల గురించి వారితో రాహుల్ మాట్లాడారు. తర్వాత లింగరాజపురం వద్ద బస్సు దిగి అక్కడ ఉన్న వారితోనూ మాటలు కలిపారు.













