Jagan: నెల్లూరులో జగన్ పర్యటన.. పోలీసుల ఆంక్షల మధ్య ఉత్కంఠ పరిస్థితులు..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కాసేపటి క్రితమే నెల్లూరు (Nellore) జిల్లా చేరుకున్నారు. ఆయన రాక నేపథ్యంలో వైఎస్సార్సీపీ (YSRCP) శ్రేణులు భారీగా అక్కడికి చేరాయి. భారీ జనసంద్రాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రించడం చాలా కష్టంగా మారింది.
జగన్ హెలికాప్టర్‌లో నెల్లూరు చేరిన వెంటనే నేరుగా సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)ను పరామర్శించారు. ములాఖత్‌కు ముగ్గురికి మాత్రమే అనుమతి ఇవ్వగా, జైలులో వారు కొంతసేపు చర్చించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగరంలోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (Nallapureddy Prasanna Kumar Reddy) ఇంటికి వెళ్లారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఉద్రిక్తత మధ్య ఆయన ఇంటిపై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు.
జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలున్నా, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాప్తాడు (Raptadu), పొదిలి (Podili), రెంటపాళ్ల (Rentapalla), బంగారుపాళ్యం (Bangarupalem) వంటి ప్రాంతాల్లో గతంలో కార్యకర్తలు ఆంక్షలు దాటడంతో ఈసారి పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు.ఈ పర్యటనకు సంబంధించి ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ (Damodar) ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. హెలిప్యాడ్ వద్ద 10 మందికి మించి, జైలు వద్ద ముగ్గురికి మించి, నల్లపురెడ్డి ఇంటి వద్ద 100 మందికి మించి ఎవ్వరూ ఉండకూడదని స్పష్టంగా తెలిపారు. అయినా నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించే ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా నెల్లూరులోని వేదాయపాలెం (Vedayapalem), కరెంట్ ఆఫీస్ సెంటర్ (Current Office Center), ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గుమికూడిన కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. అనుమతుల్లేకుండా అక్కడికి చేరిన వారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించి, నియమాలు అతిక్రమించిన వారిపై చర్యలు కూడా తీసుకున్నారు.
జగన్ పర్యటనకు ముందస్తుగా నెల్లూరు మొత్తం 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తన ఇంటి వద్ద బైఠాయించి, కార్యకర్తలకు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనతో నెల్లూరులో రాజకీయ వేడి రాజుకుంది. పోలీసుల చర్యలతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఎంత ప్రయత్నించినా వైసీపీ నేతలు, కార్యకర్తలు చాలా ప్రదేశాలలో గందరగోళం సృష్టించడానికి ట్రై చేశారు. జగన్ పర్యటన జరిగిన ప్రతి ప్రాంతంలో ఇలాంటి ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో నెక్స్ట్ జగన్ టూర్స్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది.