ఆ 60 కేంద్రాలలో రీపోలింగ్.. సుప్రీం కోర్టు కైనా రెడీ..
ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం అన్ని విధాల సంసిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో మరొక సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మొత్తం 16 నియోజకవర్గాల్లోని 60 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలసిన వైసీపీ నేతలు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అలాగే ఎందుకు డిమాండ్ చేస్తున్నాము అనే విషయంపై తగిన ఆధారాలను కూడా సమర్పించారు.
ఈ 60 పోలింగ్ కేంద్రాలను టీడీపీ రెగ్గింగ్ కు పాల్పడింది అని తమ వినతి పత్రంలో వీరు పేర్కొన్నారు. ఎందుకు తగిన సాక్షదారాలు కూడా ఉన్నాయని.. అందుకే ఆయా కేంద్రాలలో రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ తమ అనుకున్న విధంగా స్పందించకపోతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు సైతం వెళ్లడానికి తాము రెడీగా ఉన్నామని వారు పేర్కొన్నారు. అన్యాయాన్ని సహించేది లేదని.. రిగ్గింగ్ పై న్యాయ పోరాటం చేస్తామని..వైసీపీ నేతలు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి.. ఏపీ సీఈఓని కలసి తమ ఫిర్యాదును అందజేశారు. ఎన్నికల రోజున మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటనలను ముసుగుగా చేసుకొని టీడీపీ రెగ్గింగ్ కు పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆరోజు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి జిల్లా ఎస్పీకి పలు దాఫాలు ఫిర్యాదు చేశారని.. కానీ వారు టిడిపికి అనుకూలంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఇక సరిగ్గా ఎన్నికలకి ముందు కావాలని పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేయడం వల్ల పోలింగ్ రోజు హింస చెలరేగిందని అన్నారు.
టీడీపీ గుండాలు ఇష్టానుసారంగా 60 పోలింగ్ కేంద్రాలలో రిగ్గింగ్ కి పాల్పడ్డారని.. ఆ 60 బూత్ లకు సంబంధించిన లైవ్ వెబ్ క్యాస్టింగ్ ఫుటేజీని బహిర్గతం చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ వీడియో ఫుటేజీల ఆధారంగా టీడీపీ నేతలపై చర్యలు కూడా తీసుకోవాలన్నారు. అన్ని అక్రమాలు జరిగితే కేవలం ఒక్క పిన్నెల్లి వీడియోని మాత్రమే బయటకు వచ్చిందని.. మిగిలిన వారివి గోప్యంగా ఉంచారని వారు అన్నారు. ఇదంతా కేవలం వైసీపీ పై బురద చల్లడానికి పన్నుతున్న పన్నాగమని.. ఇటువంటివి సరికావని పేర్కొన్నారు.













