World Telugu Conference :రాజమహేంద్రవరంలో ప్రపంచ తెలుగు మహాసభలు
గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ)లో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు (World telugu conference) నిర్వహించనున్నామని జీజీయూ కులపతి, చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు(Satyanarayana Raju) (చైతన్య రాజు) తెలిపారు. రాజమహేంద్రవరం(Rajahmundry) సమీపంలోని జీజీయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. సభా ప్రాంగణంలో నన్నయ్య భట్టారకుడు, రాజరాజనరేంద్ర, వీరేశలింగం పేర్లతో వేదికలు తీర్చిదిద్దుతున్నామని, సభల నిర్వహణకు 18 కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు.
విశిష్ట అతిథులుగా మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు(M. Venkaiah Naidu), సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ(Justice N.V. Ramana), తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, సినీ నటులు, రచయితలతో పాటు భాషా పండితులు, కవులు హాజరవుతారని చైతన్యరాజు తెలిపారు. పద్య పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహాసభల్లో బహుమతులు అందిస్తామని ఉపకులపతి డాక్టర్ యు.చంద్రశేఖర్ వెల్లడిరచారు. ఈ సమావేశంలో ప్రముఖ రచయిత, కాలమిస్ట్ యర్రాప్రగడ రామకృష్ణ పాల్గొన్నారు.













