పొత్తు రాజకీయాలను పవన్ ఎందుకు నమ్ముకుంటున్నారు..?
జనసేనాని పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్, జనసైనికులు, కాపు సామాజిక వర్గం బలంగా కోరుకుంటోంది. పవన్ కు సైతం ఆఆశ ఉంది. కానీ.. ఆయన మాత్రం … సీఎం పదవిని వరిస్తాననడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడే కావాలంటున్నారు. ఆయన సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధిదిశగా సాగుతుందంటున్నారు. ఎందుకిలా..? ఇదే ఆయన అభిమానులు, కార్యకర్తలు, కాపు సామాజిక వర్గం, విశ్లేషకులను సైతం వేధిస్తోంది.
పవన్ ఏదో ఆశామాషీగా టీడీపీతో పొత్తు కోరుకోవడం లేదు. పవన్ కు తనబలమేంటో తెలుసు.. తన పార్టీ బలం ఏమిటో కూడా కచ్చితంగా తెలుసు. కాదని రంగంలోకి నేరుగా దిగితే ఏం జరుగుతుందో 2019 ఎన్నికల ఫలితాలు కుండబద్దలు కొట్టాయి. ఆయన పోటీ చేసిన రెండు సీట్లలోనూ పవన్ ఓడిపోయారు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. దీనికి తగినట్లుగానే ఇటీవలే తెలంగాణలో పోటీ చేసి, నోటా కన్నా తక్కువ ఓట్లను సాధించారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ తనకు సీఎం పదవి ఎలా కోరగలరు..?
అందుకే పవన్ కల్యాణ్.. తెలంగాణలో బీఆర్ఎస్ అనుసరించిన పాలసీలను అనుసరిస్తున్నట్ల కనిపిస్తోంది. బీఆర్ఎస్ కూడా ఉద్యమ సమయంలో పొత్తు రాజకీయాలు నడిపింది. అవసరాన్ని బట్టి, ఏపార్టీ అయినా తమకు అభ్యంతరం లేదంటూ పొత్తులతో పోటీ చేసింది. సింగిల్ గా పోటీ చేస్తే ఆపార్టీకి సైతం తగినన్ని సీట్లు రాలేదు. ఎందుకంటే రాష్ట్రం సాధించడం అంత ఈజీ కాదన్న భావనతో అప్పుడు… తెలంగాణ ప్రజలున్నారు కాబట్టి. అలాంటిది ఎప్పుడైతే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్.. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందో .. ఇంకేముంది కేసీఆర్ తన బలాన్ని చూపించారు. ఎంఐఎంతో కలిసి పోటీ చేసి రెండుసార్లు రాష్ట్రాధికారం చేపట్టారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సైతం… అదే పంథా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన పార్టీని జనం నమ్మి, ఓట్లు సీట్లు తగినన్ని వచ్చే వరకూ పొత్తు రాజకీయాలు నడిపే అవకాశముంది. ఈలోగా పార్టీని బలోపేతం చేసి, క్యాడర్ ను పెంపొందించుకునే పని చేపడుతున్నారు.
పవన్. పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతమైన తర్వాత సింగిల్ గా జనసేన పోటీ చేసే ఛాన్సుంటుంది. అదీ కాక.. వైసీపీ టార్గెట్ గా కూడా జనసేన ఉంది. ఇలాంటి పరిస్థితిలో సింగిల్ గా పోటీ చేసి ఘోరంగా ఓడితే.. ఇక వైసీపీ సైబర్ సైన్యం.. తాటాకులు కట్టేస్తుంది. అదీ మరీ ఇబ్బందికర పరిస్థితి. అందుకే అత్యంత జాగ్రత్తగా పవన్… తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పక తప్పదు.













