Andhra Pradesh: త్యాగానికి నివాళి ఎక్కడ? ఆంధ్రులకు దూరమైన అవతరణ దినోత్సవం..
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం (Madras State) నుంచి ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు రావడం వెనుక దీర్ఘమైన పోరాట చరిత్ర ఉంది. 1953 అక్టోబర్ 1న పదకొండు జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూల్ (Kurnool)ను రాజధానిగా చేసుకుని తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు (Tanguturi Prakasam Pantulu) బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ రాష్ట్ర అవతరణ అంత సులువుగా సాధ్యపడలేదు. అప్పట్లో దేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) మొదట ఈ విభజనకు అంగీకరించలేదు. మద్రాస్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ (C. Rajagopalachari) కూడా విడిపోయే ప్రయత్నాలను అడ్డుకునే దిశగా వ్యవహరించారు.
ఈ పరిస్థితుల్లోనే పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) ఆంధ్రుల హక్కుల కోసం రంగంలోకి దిగారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన 1952 అక్టోబర్ 19న అమరణ దీక్ష ప్రారంభించారు. అది 58 రోజుల పాటు కొనసాగి చివరకు 1952 డిసెంబర్ 15న ఆయన ప్రాణత్యాగంతో ముగిసింది. ఆ త్యాగమే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం దీక్ష చేశారని. నిజానికి ఆయన త్యాగం నేటి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసమే.
ఆంధ్ర రాష్ట్రం 1953 నుంచి మూడేళ్లపాటు కర్నూల్ రాజధానిగా కొనసాగింది. తరువాత హైదరాబాద్ స్టేట్ (Hyderabad State)తో విలీనం అయి 1956 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. అప్పటి నుంచి నవంబర్ 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఆంధ్రులు జరుపుకుంటూ వచ్చారు. కానీ 2014లో రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రత్యేక రాష్ట్రంగా మారిన తర్వాత ఈ సంప్రదాయం క్రమంగా కనుమరుగవుతోంది. తొలి ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టగా, తరువాతి ప్రభుత్వం కొంతకాలం నవంబర్ 1ని గుర్తు చేసింది. అయితే 2024 తర్వాత మళ్లీ అవతరణ దినోత్సవం అనే భావనే కనబడడం లేదు.
వాస్తవానికి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తేదీ అక్టోబర్ 1. ఆ రోజునే అవతరణ దినోత్సవంగా ప్రకటించవచ్చు. లేదంటే దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న నవంబర్ 1నైనా కొనసాగించవచ్చు. కానీ ఈ రెండు తేదీలను విస్మరించి, రాష్ట్ర పుట్టిన రోజే లేదన్నట్టుగా వ్యవహరించడం ఆంధ్రాభిమానులకు బాధ కలిగిస్తోంది.నిన్న ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా మరొకసారి మన రాష్ట్రానికి అవతరణ దినోత్సవం జరుపుకోవడం లేదు అన్న బాధ ప్రతి ఆంధ్రాభిమానిని తీవ్రంగా కలిచివేసింది.
పొట్టి శ్రీరాములు కలలుగన్నది సమగ్ర ఆంధ్ర అభివృద్ధి. అన్ని ప్రాంతాలు సమానంగా ఎదగాలన్నదే ఆయన ఆశయం. మద్రాస్ పాలనలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడిన ఆంధ్రుల ఆత్మగౌరవమే ఆ ఉద్యమానికి ప్రాణం పోసింది. ప్రకాశం పంతులు వంటి నాయకులు కూడా అప్పటి పాలకుల అహంకారానికి ఎదురునిలిచారు. అలాంటి మహనీయుల త్యాగాలు, ఆశయాలు నెరవేర్చడం నేటి పాలకుల బాధ్యత. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టమైన అవతరణ దినోత్సవాన్ని ప్రకటించి, ప్రతి ఏడాది ఒక గొప్ప పండుగలా జరపాల్సిన అవసరం ఉంది. అదే ఆ మహానుభావులకు నిజమైన నివాళి.






