2035 నాటికి దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా ఏపీ .. ఉపాసనతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి లోకేశ్
2035 నాటికి హెల్తీ, వెల్దీ, హ్యాపీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం
పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి
యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి
‘యంగ్ ఆంధ్ర.. థ్రైవింగ్ ఆంధ్ర’ ముఖాముఖిలో మంత్రి నారా లోకేష్
మహిళల ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక స్వావలంబనపై ఉపాసన కొణిదెల ప్రశ్నల వర్షం
విశాఖపట్నం: యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. వారు ఆరోగ్యంగా, సంతోషంగా, నైపుణ్యాలతో, ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేయడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తన ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు. యువతలో ఏదైనా సాధించాలన్న తపన వారిలోంచే రావాలని, ఆ ఆలోచనను తల్లిదండ్రులు, ప్రభుత్వం కల్పించలేదన్నారు. తమపై తాము నమ్మకంతో లక్ష్యసాధన దిశగా ముందడుగు వేయాలని లోకేష్ పిలుపునిచ్చారు.
విశాఖపట్నంలో గురువారం జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ‘యంగ్ ఆంధ్ర.. థ్రైవింగ్ ఆంధ్ర – ఆరోగ్యం, ఆనందం, మానవ సామర్థ్యంపై కొత్త సంభాషణ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్, UR లైఫ్ వ్యవస్థాపకురాలు ఉపాసన కొణిదెల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, మహిళా సాధికారత, కుటుంబ విలువలు, సాంకేతికత, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం తదితర అంశాలపై ఉపాసన అడిగిన ప్రశ్నలకు లోకేష్ సూటిగా సమాధానాలిచ్చారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములం కావడం గర్వంగా ఉంది
ఆంధ్రప్రదేశ్‌తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. ఆధ్యాత్మిక యాత్ర అనగానే అందరికీ ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఉపాసన ఆకాంక్షించారు. తిరుపతి బాలాజీతో పాటు తన తాతగారి స్వస్థలమైన చిత్తూరుతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. లోకేష్ తాతగారు ఆత్మగౌరవం కోసం నిలబడితే, తన తాతగారు వైద్యరంగానికి జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. వారి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని లోకేష్‌ను ప్రశ్నించారు.
లోకేష్ స్పందిస్తూ.. మద్రాసు రాష్ట్రం నుంచి కర్నూలు, హైదరాబాద్, ఇప్పుడు అమరావతి వరకు ఆంధ్రప్రదేశ్ అనేకసార్లు పునఃప్రారంభం కావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టే ప్రక్రియలో భాగస్వాములం కావడం గర్వంగా ఉందన్నారు. ఉపాసన తాతగారు ఇప్పటికీ అదే ఉత్సాహంతో వైద్యరంగానికి సేవలందించడం తనకు స్ఫూర్తినిస్తోందన్నారు. అనారోగ్య సమస్య వచ్చిన తర్వాతే వైద్యులను సంప్రదించే అలవాటుకు బదులుగా.. షుగర్, బీపీ వంటి సమస్యల విషయంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకునేలా యువతలో అవగాహన కల్పించాలని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నర్సులకు భారీ డిమాండ్.. ఏపీ యువతకు అవకాశాలు
హెల్త్‌కేర్ రంగంలో శిక్షణ పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రావాలనే స్థాయికి రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్లాలన్న ఉపాసన ప్రశ్నకు లోకేష్ సమాధానమిస్తూ.. వైద్యరంగంలో మన యువతకు దేశీయంగా, విదేశాల్లోనూ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొందరు నర్సులు జపనీస్, జర్మన్ భాషలు నేర్చుకుంటున్నారని, ఆయా దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. విద్యార్థులు చదువుకునే దశలోనే వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను పరిచయం చేయాలని, వాటికి అనుగుణంగా శిక్షణలో మార్పులు తీసుకురావాలని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 58 లక్షల మంది నర్సుల అవసరం ఉందని, ఈ కొరతను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించవచ్చని ఉపాసన పేర్కొన్నారు. హెల్త్‌కేర్ రంగంలో ఎక్కడెక్కడ కొరత ఉంది, యువతను ఈ రంగంలోకి ఎలా తీసుకురావాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై ఉపాసన సలహాలు తీసుకుంటానని లోకేష్ చెప్పారు.
మహిళలు ఉద్యోగాలు మానేయకుండా పిల్లల సంరక్షణ సదుపాయాలు
మాతా శిశు మరణాల రేటు తగ్గడం మంచి పరిణామమని, అయినప్పటికీ చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఉపాసన అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పిల్లలు పుట్టిన తర్వాత సంరక్షణ బాధ్యతల కారణంగా చాలామంది మహిళలు ఉద్యోగాలు మానేస్తున్నారని, వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకురావడానికి ఏం చేయాలనే అంశాన్ని ప్రస్తావించారు.
దీనిపై లోకేష్ స్పందిస్తూ.. కంపెనీలు మహిళలకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ముఖ్యంగా ఫ్యాక్టరీల్లోనూ మహిళలకు అవకాశాలు పెరగాలని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా అనంతపురంలో కలిసిన ఓ మహిళ కియా ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని తానే పోషించుకుంటున్నానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. చదువుకున్నప్పటికీ అంతకుముందు ఆమెకు సరైన అవకాశం లభించలేదని తెలిపారు.
పనిచేసే చోటే పిల్లల సంరక్షణకు సదుపాయాలు కల్పిస్తే మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అంగన్వాడీ కేంద్రాలు కూడా ఈ విషయంలో తోడ్పడతాయని చెప్పారు. ఒకటి, రెండు తరగతుల పాఠ్యపుస్తకాల్లో గతంలో ఇంటి పనులు చేస్తున్న మహిళల చిత్రాలే ఉండేవని, ఇప్పుడు మహిళలు, పురుషులు ఇద్దరూ పనులు పంచుకుంటున్నట్లు చిత్రాలను మార్చామని వివరించారు. అమెరికాలో ఉన్నప్పుడు తాను, బ్రాహ్మణి వంతులవారీగా ఇంటి పనులు చేసుకునేవారమని చెప్పారు. సినిమాల్లోనూ ‘ఆడపిల్లలా ఏడవకు’ వంటి మాటలను ప్రోత్సహించకూడదన్నారు.
తమ సంస్థలో కొందరు మహిళలు భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నా.. ఇంట్లో ఏమంటారోనన్న భయంతో జీతం వివరాలు చెప్పడం లేదని ఉపాసన సరదాగా వ్యాఖ్యానించారు. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తే ఆయనకు ఓ బహుమతి కొనివ్వాలని చమత్కరించారు. దీనికి లోకేష్ స్పందిస్తూ.. బ్రాహ్మణి తన ఆదాయం విషయంలో ఎప్పుడూ బహిరంగంగానే ఉంటారని, తన క్రెడిట్ కార్డు బిల్లులు కూడా ఆమెనే చెల్లిస్తారని నవ్వుతూ చెప్పారు.
తన జీవితంలో ఈ స్థాయికి చేరుకోవడానికి తల్లి, భార్య ఇద్దరూ ముఖ్యమైన కారణమని లోకేష్ పేర్కొన్నారు. తన చదువు విషయంలో తల్లి మార్గనిర్దేశం చేశారని, యువగళం పాదయాత్ర సమయంలో వారాంతాల్లో కూడా ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో బ్రాహ్మణి ఇచ్చిన మద్దతుతోనే పాదయాత్రను కొనసాగించగలిగానని చెప్పారు.
పిల్లల పెంపకం ఇద్దరి బాధ్యత.. ఇంటి నుంచే సమానత్వం మొదలవ్వాలి
తండ్రి పిల్లలకు అన్నం తినిపించినా, డైపర్ మార్చినా అందరూ ప్రశంసిస్తారని, అదే తల్లి చేస్తే సాధారణ విషయంగా చూస్తారని ఉపాసన అన్నారు. పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యత అని, ఇంట్లో ఈ ఆలోచన మారితేనే కార్యాలయాల్లోనూ మార్పు వస్తుందని చెప్పారు.
పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తారని లోకేష్ అన్నారు. తన తల్లిదండ్రులు పరస్పరం ఎలా ఉండేవారో చూసి తాను కూడా అదే విధంగా ఉండాలని నేర్చుకున్నానని చెప్పారు. పాఠశాలల్లో విలువలు నేర్పడంతో పాటు ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుందన్నారు. పిల్లలకు నేర్పించాల్సింది క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అని లోకేష్ చెప్పగా… మంచి తండ్రి పిల్లలను చూసుకోవడంతో పాటు భార్యకు కూడా అండగా ఉండాలని, ఇద్దరూ బాధ్యతలు పంచుకుంటే మహిళలు ఉద్యోగాల్లో కొనసాగేందుకు వీలవుతుందని ఉపాసన పేర్కొన్నారు.
రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది
రాజకీయాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని లోకేష్ చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ మంది మహిళలకు అవకాశాలు కల్పించిందని, వారు అద్భుతంగా పనిచేశారని తెలిపారు. ఇదే విధంగా కొనసాగితే తన ఉద్యోగానికే ప్రమాదం రావచ్చంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
కుటుంబానికి సమయం కేటాయించడమే కష్టం
ర్యాపిడ్ ఫైర్‌లో భాగంగా ఒక మంత్రిత్వ శాఖ నిర్వహించడం కష్టమా? ముగ్గురు పిల్లలను చూసుకోవడం కష్టమా? అని ఉపాసన అడగ్గా.. కుటుంబానికి సమయం కేటాయించడమే తనకు అన్నింటికంటే కష్టమని లోకేష్ చెప్పారు. చదువు, ఉద్యోగాల కారణంగా తాను, బ్రాహ్మణి కొంతకాలం వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చిందని, అవకాశం దొరికినప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
దేవాన్ష్ డైనోసార్ పోడ్కాస్ట్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడని ఉపాసన ప్రశంసించగా.. అతను సినిమాల్లోకి వెళ్తాడేమోనని తాను నిజంగానే ఆందోళన చెందుతున్నానని లోకేష్ సరదాగా అన్నారు. తన తాతగారి నుంచి నేర్చుకున్న ముఖ్యమైన విషయం క్రమశిక్షణ అని చెప్పారు. ఆయన ఉదయాన్నే నిద్రలేచి, చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టేవారని, చెప్పాల్సిన విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు.
ఉపాసన తన తాతగారికి 90 ఏళ్లు దాటినా ప్రతిరోజూ ఫోన్ చేసి ‘ఈ రోజు నువ్వు చేసిన మంచి పని ఏంటి?’ అని అడుగుతారని చెప్పారు. ఆ ప్రశ్న రోజూ ఏదో ఒక మంచి పని చేయాలనే స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు.
ఏఐని ఉపయోగించుకోవాలి.. నిర్ణయం మాత్రం మనదే
కృత్రిమ మేధస్సు (ఏఐ) ఎప్పటికీ మనిషి స్థానాన్ని భర్తీ చేయలేని అంశం ఏమిటని ఉపాసన ప్రశ్నించగా.. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఏఐ భర్తీ చేయలేదని లోకేష్ చెప్పారు. మన పనిని మరింత సమర్థంగా చేసుకోవడానికి ఏఐని ఉపయోగించుకోవచ్చని, ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టాలనే అంశాన్ని విశ్లేషించేందుకు తాను కూడా ఏఐని ఉపయోగించానని తెలిపారు. చాట్‌జీపీటీ వంటి టూల్స్‌ను వినియోగించుకోవాలని, తుది నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలని యువతకు సూచించారు.
కాలేజీ నుంచి బయటకు వచ్చేలోపు ప్రతి యువకుడు నేర్చుకోవాల్సిన మూడు విషయాలు ఏమిటని ఉపాసన అడగ్గా.. మహిళలను గౌరవించడం, క్రమశిక్షణ, చేసే పని పట్ల తపన కలిగి ఉండటం ముఖ్యమని లోకేష్ చెప్పారు. రోజువారీ పనులకు ఒక క్రమం ఏర్పాటు చేసుకుంటే ఏం చేయాలనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులోనూ రాత్రి 11 గంటల వరకు పనిచేస్తున్నారని, మెరుగైన నగరాలను నిర్మించాలి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలపాలన్న తపనే ఆయనను ముందుకు నడిపిస్తోందని చెప్పారు.
ఇంట్లో ప్రతి తండ్రి తప్పనిసరిగా చేయాల్సిన పని ఏమిటని ఉపాసన అడగ్గా.. ‘వాషింగ్ మెషీన్లు ఉన్నాయి కదా!’ అంటూ లోకేష్ నవ్వులు పూయించారు. ఇంటి పనులను భార్యాభర్తలు ఇద్దరూ పంచుకోవాలని చెప్పారు. తాను, బ్రాహ్మణి కలిసి పెరుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకున్నామని తెలిపారు. తాను యువగళం పాదయాత్రలో ఉన్న సమయంలో తండ్రి అరెస్టు కావడం, ఆ 53 రోజులపాటు తల్లి భువనేశ్వరి, బ్రాహ్మణి తనకు అండగా నిలిచిన తీరు కుటుంబం విలువను మరింత తెలియజేశాయని చెప్పారు. కెరీర్లో ఎంత ఎదిగినా మనకు అండగా నిలిచే వారికి సమయం కేటాయించాలని సూచించారు.
లక్షలాది మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో 100 యూనికార్న్ కంపెనీలు ఉండాలా? లేక లక్ష మంది సొంతంగా వ్యాపారాలు చేసుకునే పారిశ్రామికవేత్తలు ఉండాలా? అని ఉపాసన అడిగిన ప్రశ్నకు.. తన ఎంపిక ఎప్పుడూ లక్షలాది మంది పారిశ్రామిక వేత్తలేనని లోకేష్ సమాధానమిచ్చారు. తమ లక్ష్యం 1.30 కోట్ల మంది ప్రజలకు సొంతంగా ఉపాధి కల్పించే అవకాశాలు కల్పించడమని, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నది ఆలోచనగా చెప్పారు.
ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేసే ఓ మహిళకు పీ4 కార్యక్రమం ద్వారా పెట్టుబడి, సలహాలు అందించడంతో ఇప్పుడు ఆమె సొంతంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుని నెలకు దాదాపు రూ.1లక్ష సంపాదిస్తున్నారని ఉదాహరణగా వివరించారు. చీరలు తయారు చేయడం, ఇంట్లో వంట చేసి విక్రయించడం వంటి చిన్న వ్యాపారాలు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మార్గాలని ఉపాసన అన్నారు. ఏ వయసులో ఉన్నవారైనా, ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చినవారైనా సొంతంగా వ్యాపారం ప్రారంభించవచ్చని చెప్పారు.
పని పూర్తి చేయడంలో ఏపీ వేగం ప్రత్యేకం
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఏ విషయంలో మెరుగ్గా ఉందని ఉపాసన అడగ్గా.. ‘స్పీడ్.. స్పీడ్.. స్పీడ్’ అని లోకేష్ సమాధానమిచ్చారు. పనులు పూర్తి చేసే వేగం, పెట్టుబడులు తీసుకొచ్చే వేగం, సంబంధాలు పెంచుకునే వేగం రాష్ట్రానికి ప్రత్యేకమని వివరించారు.
డబ్బు అడ్డంకి కాకపోతే ఏ పాలసీ తీసుకొస్తారని అడిగిన ప్రశ్నకు.. ముందుగా ఏ అవకాశాలు ఉన్నాయో గుర్తించాలని, మొదట్లోనే డబ్బు సమస్యగా భావిస్తే చేయగలిగే పనుల పరిధి తగ్గిపోతుందని చెప్పారు. పాలసీ నిర్ణయించిన తర్వాత దానికి అవసరమైన నిధులు సమకూర్చుకునే మార్గాలు లభిస్తాయని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ప్రాజెక్టుల పనులు ప్రారంభించేలా చేశామని తెలిపారు. రాష్ట్రం ఇప్పటికీ వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడుతున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 21 నుంచి 22 శాతం పెరుగుతున్నాయని చెప్పారు.
2035 నాటికి దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా ఏపీ
2035 నాటికి ఆంధ్రప్రదేశ్ ఏ విషయంలో దేశంలో నంబర్ వన్ కావాలని కోరుకుంటున్నారని ఉపాసన అడగ్గా.. ‘సంతోషంలో’ అని లోకేష్ సమాధానమిచ్చారు. ప్రజలు తమకు నచ్చిన విధంగా జీవించ గలుగుతున్నారా? వారికి అవసరమైన అవకాశాలు అందుతున్నాయా? ప్రభుత్వం వారి అవసరాలకు స్పందిస్తోందా? అనే అంశాల ఆధారంగా ప్రజల సంతోషాన్ని అంచనా వేయాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ సేవలపై ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో తెలుసుకునేందుకు ఫోన్ చేసి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. తన గురించి ఫోన్ వస్తే మాత్రం మంచి మార్కులు వేయాలని సరదాగా కోరారు.
ఉపాసనను ప్రశ్నించిన లోకేష్.. యువతకు ఉపాసన కీలక సూచనలు
ఈ ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా ఉపాసనను పలు ప్రశ్నలు అడిగారు. సినిమాలా? హెల్త్కేరా? అన్న ప్రశ్నకు ఉపాసన హెల్త్‌కేర్ అని సమాధానమిచ్చారు. రామ్ చరణ్ సినిమాల్లో తనకు ‘నాయక్’ అంటే ప్రత్యేక ఇష్టమని, వివాహం తర్వాత తొలిసారి సందర్శించిన చరణ్ సినిమా సెట్ అదే కావడంతో ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండి పోతుందని చెప్పారు.
యువతకు, ముఖ్యంగా మహిళలకు మీరిచ్చే సలహా ఏమిటని లోకేష్ అడగ్గా.. యువతకు గౌరవం, ఉద్యోగం, సొంత కాళ్లపై నిలబడే అవకాశం కావాలని ఉపాసన చెప్పారు. ముఖ్యంగా మహిళలకు సొంత ఆదాయం ఉంటే భద్రతతో పాటు తమ నిర్ణయాలు తామే తీసుకునే స్వేచ్ఛ లభిస్తుందని వివరించారు. తాను, లోకేష్ కలిసి కొంతమందికైనా ఉద్యోగాలు కల్పించగలిగితే అదే పెద్ద విజయమని పేర్కొన్నారు.
కుటుంబ వ్యాపారంలోకి తిరిగి రావాలన్న ఆలోచన ఎలా వచ్చిందని లోకేష్ అడిగిన ప్రశ్నకు.. తన తాతగారి మాటలే అందుకు కారణమని ఉపాసన చెప్పారు. పుట్టిన కుటుంబం, వివాహం ద్వారా వచ్చిన కుటుంబం కారణంగా తనకు లభించిన అవకాశాలను ఉపయోగించుకుని ఇతరులకు ఉపయోగపడే పనులు చేయాలని తాతగారు చెప్పారని, ఆ మాట తనపై ఎంతో ప్రభావం చూపిందని వివరించారు.
హెల్త్‌కేర్ రంగంలో తనకు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక ఆసక్తి ఉందని ఉపాసన తెలిపారు. కళాశాల విద్య పూర్తయ్యాక యువతులు తమ శరీరం, ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవాలని, ఫెర్టిలిటీ చెక్అప్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచించారు. దీనివల్ల కెరీర్, కుటుంబం వంటి అంశాలపై సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని చెప్పారు.
నమ్మకంతో తొలి అడుగు వేయాలి
కార్యక్రమం ముగింపులో యువతకు సందేశం ఇవ్వాలని ఉపాసన కోరగా.. ఏదైనా సాధించాలన్న తపన యువతలో అంతర్గతంగా రావాలని లోకేష్ చెప్పారు. తల్లిదండ్రులు లేదా ప్రభుత్వం ఆ తపనను వారిలో కల్పించలేరని స్పష్టం చేశారు. తాను కార్నెగీ మెలన్లో చదివానని, ప్రపంచ బ్యాంకులో పనిచేశానని, అయినప్పటికీ స్టాన్‌ఫోర్డ్‌లో ప్రవేశం వస్తుందని ఊహించలేదని గుర్తుచేసుకున్నారు. దరఖాస్తు చేసి ప్రయత్నించడంతోనే ఆ అవకాశం వచ్చిందని చెప్పారు. యువత తమపై తాము నమ్మకం పెట్టుకుని, కోరుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ధైర్యంగా తొలి అడుగు వేయాలని పిలుపునిచ్చారు.







