‘టెన్నెస్సీ తెలుగు సమితి’’ ఆధ్వర్యంలో ‘వెటరన్స్ డే’ వేడుక
దేశం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా చూస్తూ, అహర్నిశలూ దేశం కోసం సేవలందించే వారు సైనికులు. ఇలాంటి సైనికులను, మాజీ సైనికులను గౌరవిస్తూ ‘‘టెన్నెస్సీ తెలుగు సమితి’’ ఆధ్వర్యంలో ‘వెటరన్స్ డే’ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నవంబర్ 11న జరుపుకొనే ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని, అమెరికా రక్షణ రంగంలో సేవలు అందించిన వీర జవాన్లకు టెన్నెస్సీ తెలుగు సమితి తరఫున ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. “మన దేశం కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడి, అంకితభావంతో సేవ చేసిన ధైర్యశాలులైన సైనికులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు” అని సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఏ దేశానికైనా సైనికులే వెన్నెముకగా పనిచేస్తుంటారని, వారి వల్లే దేశం సురక్షితంగా వుంటుందని, వారిని నిత్యం స్మరించుకోవడం అందరి విధి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైనికుల సేవ, త్యాగం, ధైర్యం మరియు అంకితభావం (Service, Sacrifice, Courage, Commitment) వంటి గుణాలను కొనియాడుతూ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా కలిసికట్టుగా దేశభక్తిని చాటుకున్నారు. తమ ధైర్య సాహసాలతో దేశానికి సేవలందిస్తున్న సైనికులందరికీ మన:స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.







