షాకింగ్.. రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు!
వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. తెలుగుదేశంలో ఉన్నా, వైసీపీలో ఉన్నా ఆమె డేర్ నెస్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన తర్వాత అక్కడ కూడా బాగా రాణిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ప్రస్తుతం apiicకి ఛైర్ పర్సన్ గా కూడా కొనసాగుతున్నారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నా.. మరోవైపు బుల్లితెరపై మెరుస్తున్నారు. జబర్దస్త్ షో రోజాకు బాగా పేరు తెచ్చింది.
ఇటీవలి మున్సిపల్ ఎన్నికల వరకూ రోజా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమరావతి వెళ్లి సీఎం జగన్ తో కలిసి సంబరాలు కూడా చేసుకున్నారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో కూడా తామే గెలుస్తామని చెప్పారు. అయితే ఇంతలోనే రోజా మీడియాకు దూరంగా ఉండిపోయారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే అందరూ తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికపై రోజా ఫోకస్ చేస్తారని అందరూ భావించారు. అయితే ఆమె కనిపించకుండా పోయారు.
అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. అయితే సమస్య ఏంటనేది ఎవరికీ తెలియదు. తాజాగా ఆమె భర్త సెల్వమణి ఓ ఆడియో రిలీజ్ చేశారు. రోజాకు చెన్నైలో రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని.. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ఇవాళే ఆమెను ఐసీయూ నుంచి వార్డుకు షిఫ్ట్ చేశారని తెలిపారు. ఈ ఆపరేషన్లు ఎప్పుడో చేయించుకోవాల్సి ఉందని.. అయితే గతేడాది కరోనా, ఈ ఏడాది ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయని సెల్వమణి వివరించారు. రోజా ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అభిమానులెవరూ ఆసుపత్రి వద్దకు రావద్దని కోరారు. రెండు వారాల పాటు రోజాకు విశ్రాంతి అవసరమని చెప్పారు.
నిన్నమొన్నటి వరకూ ఫుల్ యాక్టివ్ గా కనిపించిన రోజా.. ఇప్పుడు అనూహ్యంగా ఆసుపత్రిలో చేరి రెండు మేజర్ ఆపరేషన్లు చేయించుకున్నారని తెలియగానే ఆమె అభిమానులు, అనుచరులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే ఆమెకు చేసిన ఆపరేషన్లు రెండూ ఇప్పటికిప్పుడు చేయాలని నిర్ణయించుకున్నవి కాదు.. ఇంతకుముందే ఈ ఆపరేషన్లు చేయించుకోవాలని రోజా నిర్ణయించుకున్నారు.. అంటే ఆమెకు ముందే తన అనారోగ్యం గురించి తెలుసు.. కానీ ఎవరికీ ఈ విషయాన్ని వెల్లడించేలేదు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రోజా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.













