రమణ దీక్షితులపై వేటు..! జగన్తో ఎక్కడ చెడింది..?
రమణ దీక్షితులు హిందువులందరికీ సుపరిచితం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గౌరవ ప్రధాన అర్చకుడిగా ఉంటున్న ఆయన ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం కలిగించాయి. వీటిపై ఆగ్రహించిన టీటీడీ.. ఆయనపై వేటు వేసింది. అయితే గతంలో వైసీపీకి, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రమణ దీక్షితులు.. ఇప్పుడు దూరమవడానికి కారణమేంటి..? ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
2018లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆలయ అర్చకులకు ఒక వయసు నిర్ణయించి.. ఆ పైబడిన వారు రిటైర్ కావాల్సిందిగా నిర్దేశించింది. దాని మేరకు రమణ దీక్షితులతో పాటు నలుగురు అర్చకులు రిటైర్ అవ్వాల్సి వచ్చింది. అయితే దీనిపై కోర్టును ఆశ్రయించారు రమణ దీక్షితులు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వంపై పింక్ డైమండ్ తో పాటు పలు ఆరోపణలు చేశారు. ఈ సమయంలో ఆయన వైసీపీకి, జగన్ కు అనుకూలంగా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రమణ దీక్షితులను గౌరవ ప్రధానార్చకుడిగా నియమించింది.
గౌరవ ప్రధానార్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు ఆలయానికి వెళ్లడం చాలా తక్కువ. అయినా ఠంచనుగా జీతం తీసుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఆయన జోలికి వెళ్లలేదు. అయినా ఆయనలో ఏదో తెలీని అసంతృప్తి. తనను పట్టించుకోవట్లేదనే అక్కసుతో వైసీపీకి కూడా దూరమయ్యారు. ప్రభుత్వంపైన, జగన్ పైన విమర్శలు చేయడం మొదలు పెట్టారు. గతంలో మోదీ పర్యటన సందర్భంగా టీటీడీని పరిరక్షించాలని, అన్యమతుస్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ట్వీట్ చేశారు. ఆ వెంటనే దాన్ని డిలీట్ చేశారు. తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్ అని, సీఎం జగన్ క్రిస్టియన్ అని.. టీటీడీలో క్రిస్టియన్లు ఎక్కువైపోయారని కామెంట్ చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు జరగట్లేదని ఆరోపించారు.
అయితే బీఎస్వై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రమణ దీక్షితుల కామెంట్స్ ఉన్నాయని.. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన లేఖ రాశారు. మరోవైపు టీటీడీ కూడా రమణ దీక్షితులు కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుంది. తిరుపతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. మరోవైపు.. ఆయన ఆరోపణలపై వివరణ ఇచ్చింది. తాజాగా టీటీడీ పాలకమండలి సమావేశంలో ఆయనపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న రమణ దీక్షితుల వ్వవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పుడైనా ఆయన హయాంలో మాయమైన పింక్ డైమండ్ పై స్పందించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.






