వెంకట “రమణా” గోవిందా…
ఆంధప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని రకరకాలుగా ఇరుకున పెట్టిన అంశాల్లో తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అంశం ముందుంటుంది. ఆ సమయంలో ఆయన పలు తీవ్రమైన ఆరోపణలు సైతం చేశారు. శ్రీవారి నగల విషయంలోనూ వార్తలు పేల్చారు. ఇక పింక్ డైమండ్ మిస్ అయిందని, దేశం దాటిపోయిందని ఆయన చేసిన ఆరోపణలు బాబు ప్రభుత్వం ఆయనపై తీవ్ర చర్యలకు దిగేలా చేసింది కూడా.
అలాంటి రమణ దీక్షితులు ప్రభుత్వం మారాక.. మరోసారి తన గళానికి పదును పెట్టారు. 15 రోజుల క్రితం టిటీడీని రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని ఆయన తీవ్రమైన డిమాండ్ చేశారు. ఆ సంచలనం కొనసాగుతుండగానే… కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా దర్శనాలు ఆపడం లేదంటూ సిఎంకు ఫిర్యాదు చేశారు. టీటీడీ లోని 50 మంది అర్చకుల్లో 15 మందికి పాజిటివ్ వచ్చింది. అయినా దర్శనాలు కొనసాగిస్తున్నారు. అధికారులు చంద్రబాబు అనుసరించిన వైఖరిని కొనసాగిస్తున్నారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో మరోసారి తిరుమల కొండ వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి దీక్షితుల వ్యాఖ్యలకు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఘాటుగానే స్పందించారు. ఏమైనా సలహాలు ఉంటే బోర్డు ముంగిటకు తేవాలి తప్ప మీడియాకు ఫోకస్ అవ్వడం ఇక్కడ రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. దీనిపై టీటీడీ బోర్డు సభ్యులు సైతం దీక్షితులపై మండి పడుతూ ప్రకటనలు ఇస్తున్నారు.
అసలు కారణం అదేనా?
మరోవైపు దీక్షితుల వ్యాఖ్యల వెనుక అసలు కారణం వేరే ఉన్నట్టు వినిపిస్తోంది. ప్రభుత్వం మారాక సిఎం వైఎస్ జగన్…గౌరవ ప్రధాన అర్చకులుగా ప్రత్యేక అధికారం ఇచ్చినా ఇప్పటిదాకా దీక్షితులు విధులు ఏమిటో నిర్వచించడం జరగలేదట. అలాగే అధికారులు ఆయన్ను పెద్దగా పట్టించుకోవడం కూడా జరగడం లేదట. దీనికి కారణం వైవి సుబ్బారెడ్డి అని దీక్షితులు భావిస్తున్నారంటున్నారు. స్వామి కైంకర్యాల విషయంలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని, తాను పదవిలో ఉన్నానో లేదో చెప్పమంటూ ఈవోకి లేఖ రాసినా దాన్నీ పట్టించుకోకపోవడంతోనే ఆయన బహరంగంగా రంగంలోకి దిగారంటున్నారు. అయితే ఈ సమస్యలపై సిఎంకి నేరుగా కలిసి మాట్లాడదామని ప్రయత్నించినా సమయం దొరకకపోవడానికి కూడా టీటీడీ వర్గాలే కారణంగా రమణ దీక్షితులు సందేహిస్తున్నారని, వేరే మార్గం లేకే ఆయన ఈ ట్వీట్లకు తెర తీశారని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక వర్గం ప్రజలకు దూరం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన దీక్షితుల వ్యవహారం…జగన్ ప్రభుత్వంలో ఎలాంటి కలకలం రేపనుందో…చూడాలి.













