Kovur Politics: కోవూరులో వేమిరెడ్డి, నల్లపురెడ్డి మధ్య ముదిరిన వివాదం..!

నెల్లూరు (Nellore) జిల్లా కోవూరు (Kovur) నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapureddy Prasanna Kumar Reddy) ఇంటిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై (Vemireddy Prasanthi Reddy) ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలే ఈ దాడులకు కారణమని సమాచారం. అయితే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు నల్లపురెడ్డి ప్రకటించారు. తనకు ఈ దాడులతో సంబంధం లేదని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఓడిపోయారు. తాజాగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆయన అభ్యంతరకర, వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతి రెడ్డి “అన్ని రంగాల్లో పీహెచ్‌డీ” చేశారని విమర్శించారు. ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి, బెదిరించి పెళ్లి చేసుకున్నారని, ఆమె చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసని ప్రసన్నకుమార్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. గతంలో ప్రసన్నకుమార్ రెడ్డి పైన ప్రశాంతి రెడ్డి చేసిన పీహెచ్‌డీ కామెంట్స్ కు కౌంటర్ గానే నల్లపురెడ్డి తాజాగా రియాక్ట్ అయ్యారని సమాచారం.
అయితే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. సోమవారం రాత్రి నెల్లూరులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై 50-60 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లోని ఫర్నీచర్, గాజు వస్తువులు, కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో ప్రసన్నకుమార్ ఇంట్లో లేరు. ఆయన తల్లి మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రసన్నకుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. వైసీపీ అధినేత జగన్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. వైసీపీ నాయకులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆమె భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బు అహంకారంతో ఈ దాడులను ప్రోత్సహించారని, ఇది ప్రసన్నకుమార్‌ను హత్య చేసే కుట్రగా భావిస్తున్నామని ఆరోపించారు. వారు వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అయితే.. ఈ ఆరోపణలను వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడుల సంస్కృతి తమది కాదని, ప్రసన్నకుమార్ వల్ల గతంలో చాలామంది బాధపడ్డారని, వారిలో ఎవరో ఒకరు ఈ దాడి చేసి ఉండొచ్చని ఆమె అన్నారు. ప్రసన్నకుమార్ తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తమ ఇంటి మహిళలకు చూపించాలని, ఈ వ్యాఖ్యలను వైసీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి, వేమిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ పోటీ దశాబ్దాలుగా కొనసాగుతోంది. నల్లపురెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గంలో బలమైన పట్టు కలిగి ఉండగా, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా, ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా సత్తా చాటారు. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇది కొత్త మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.