టీడీపీ – జనసేన కూటమిలోకి బీజేపీ..!!?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు కూడా మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టేశాయి. మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు విస్తృతంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. టీడీపీతో కలిసి వెళ్లేందుకు జనసేన నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ దిశగా ప్రయాణం సాగిస్తోంది. అయితే బీజేపీ పరిస్థితి మాత్రం డోలాయమానంగా ఉంది. అయితే బీజేపీ కూడా టీడీపీ – జనసేన కూటమిలోకి వచ్చే అవకాశం ఉందని తాజా సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఆ పార్టీ కేంద్రంలోని బీజేపీతో ఎంతో సఖ్యతగా ఉంటోంది. బీజేపీకి అవసరమైన అన్ని సందర్భాల్లో ఆపన్నహస్తం అందిస్తోంది. అయినా ఏపీలో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదు. ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అడపాదడపా రెండు పార్టీలు విమర్శలు కూడా గుప్పించుకుంటున్నాయి. దీంతో ఆ రెండు పార్టీలు కలిసి వెళ్లే అవకాశం లేదని అర్థమైపోయింది. పైగా పొత్తులకు వైసీపీ వ్యతిరేకం. చావోరేవో ఒంటరిగా తేల్చుకోవాలనేది వైసీపీ సిద్ధాంతం. కాబట్టి ఆ పార్టీ ఈసారి కూడా ఒంటరిగానే బరిలోకి దిగబోతోంది.
అయితే వైసీపీని ఎలాగైనా ఈసారి గద్దె దించాలనే పట్టుదలతో ఉన్నాయి టీడీపీ, జనసేన. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్లీ వైసీపీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఆ రెండు పార్టీలూ ఈసారి కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఉమ్మడిగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మేనిఫెస్టో కూడా ఈసారి ఉమ్మడిగా రిలీజ్ చేయాలని నిర్ణయించాయి. సంక్రాంతి తర్వాత విస్తృతంగా ఆ పార్టీ నేతలు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇందుకే బీజేపీయే కారణమని తెలుస్తోంది.
బీజేపీ పరిస్థితి ఏపీలో గందరగోళంగా మారింది. తాము జనసేనతో కలిసి పనిచేస్తున్నట్టు ఆ పార్టీ చెప్పుకుంటోంది. కానీ జనసేన మాత్రం టీడీపీతో ప్రయాణం చేస్తోంది. బీజేపీని కూడా టీడీపీతో కలిసి వెళ్లేలా రావాలని కోరుతోంది. కానీ బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బీజేపీతో కలిసి వెళ్లాలా.. వద్దా అనే దానిపై టీడీపీ కూడా సందిగ్ధంలో ఉంది. గతంలో బీజేపీని తీవ్రంగా విమర్శించి కటీఫ్ చెప్పింది టీడీపీ. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీతో కలిసి వెళ్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోననే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. టీడీపీ ఓకే చెప్తే పొత్తులో చేరేందుకు బీజేపీ సిద్ధంగానే ఉంది. ఏపీ బీజేపీ నేతలు కూడా టీడీపీ – జనసేన కూటమితో కలిసి వెళ్తేనే మంచిదని అధిష్టానానికి సూచిస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఈ పొత్తులకు సంబంధించిన చర్చలు పూర్తవుతాయని తాజాగా బీజేపీ నేత సుజనా చౌదరి వెల్లడించారు. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా బీజేపీని కలుపుకు వెళ్లేందుకు టీడీపీని ఒప్పించినట్టు సమాచారం. సో త్వరలోనే టీడీపీ – జనసేన కూటమిలోకి బీజేపీ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.













