టీడీపీ, జనసేనతోనే బీజేపీ..! 8న ఢిల్లీలో కీలక చర్చలు..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో.. ఏ నేత ఎక్కడ ఉంటారో కూడా అంతుచిక్కడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలేదు. అప్పుడే కప్పదాట్లు మొదలైపోయాయి. ఇక పొత్తుల లెక్కల్లో పార్టీలు మునిగిపోయాయి. అధికార వైసీపీ సింగిల్ గానే బరిలోకి దిగుతోంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ పరిస్థితి ఇంకా అర్థం కావట్లేదు. కాంగ్రెస్ కు కేడర్ లేకపోవడంతో ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రావట్లేదు. అయితే టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లేందుకే బీజేపీ రెడీగా ఉన్నట్టు తాజా సమాచారం.
2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లింది బీజేపీ. అప్పుడు ఆ రెండు పార్టీలకు జనసేన మద్దతిచ్చింది. దీంతో ఆ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇక 2019లో బీజేపీని వదిలేసిన టీడీపీ.. కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్లింది. జనసేన టీడీపీకి కటీఫ్ చెప్పేసి కమ్యూనిస్టులతో కలిసి వెళ్లింది. చివరకు వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన మళ్లీ ఒక్కటయ్యాయి. అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉంది జనసేన. అదే సమయంలో టీడీపీతో కూడా కాపురం చేస్తోంది. ఈ పితలాటకం ఏంటో అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ, జనసేన ఓకే.. మరి బీజేపీ సంగతేంటని అందరూ ఆరా తీస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీతో చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులు, సీట్లపై ఒక అవగాహనకు వచ్చాయి. బీజేపీతో చర్చించిన తర్వాత సీట్ల పంపకంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం రానుంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనంతరం మరోదఫా పవన్ కల్యాణ్ తో కలిసి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. లేదంటే గురువారమే చంద్రబాబు, పవన్ కలిసి వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపే ఛాన్స్ కూడా ఉంది.
ఏపీలో బీజేపీ ప్రభావం దాదాపు శూన్యం. ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఆ పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లు కూడా రావు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఒంటరిగా వెళ్లే మళ్లీ అదే రిపీట్ కావడం ఖాయం. అయితే ఏపీ బీజేపీ కేడర్ మొత్తం కచ్చితంగా టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లాలని కోరుకుంటోంది. ఇదే విషయాన్ని హైకమాండ్ కు స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడు టీడీపీ, జనసేనతో చర్చలు జరిపి పొత్తులపై ఫైనల్ డెసిషన్ తీసుకునేందుకు రెడీ అయింది. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













