Jagan: జగనన్న ఇళ్లకు సరఫరా పేరుతో మట్టి దోపిడీ… విచారణకు రంగం సిద్ధం..

ఏపీ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై కొత్త ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తోంది. ముఖ్యంగా మద్యం, ఇసుక సంబంధిత అక్రమాలు ఇప్పటికే విచారణ దశలో ఉన్న నేపథ్యంలో తాజాగా మట్టి అక్రమాలపై (Sand mafia) దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నేతృత్వంలో పనిచేసిన మంత్రులు, నాయకులు మట్టిని కూడా దోచుకుపోయారని అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో మట్టి అక్రమంగా తరలింపు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. కర్నూలు (Kurnool), కడప (Kadapa), కృష్ణా (Krishna), పశ్చిమ గోదావరి (West Godavari) వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరిగి, వాటిని జగన్ హయాంలో నిర్మించిన ‘జగనన్న హౌసింగ్’ (Jagan anna housing projects) ప్రాజెక్టులకు సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ తరలింపులో ప్రభుత్వ నిధులు దారి మళ్లించి మట్టిని అక్రమంగా అమ్మకం చేసినట్టు నివేదికలు చెబుతున్నాయంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో జిల్లాల డిప్యూటీ కలెక్టర్ల (Deputy Collectors) ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే కొన్ని జిల్లాల నుంచి మట్టి అక్రమాలపై ప్రాథమిక నివేదికలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇవి ఇంకా గోప్యంగానే ఉంచుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ దర్యాప్తులో అప్పటి అధికార వైసీపీకి (YCP) చెందిన నేతలే కాకుండా, అప్పటి ప్రతిపక్షానికి చెందిన కొంతమంది నాయకుల పేర్లు కూడా ఉండటం వల్ల ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేయడంపై ప్రభుత్వానికి తలనొప్పి ఏర్పడినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అంతర్గత విచారణ జరుగుతుండగా, కొందరు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కూడా ఈ మట్టి అక్రమాల వ్యవహారంలో చిక్కుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయినా ప్రభుత్వ ఉద్దేశం మాత్రం ఎవరు చేసినా తప్పులపై చర్యలు తీసుకోవడం అని చెబుతున్నారు. మొత్తానికి మట్టి సరఫరా పేరిట ప్రభుత్వ నిధులను దారి మళ్లించిన నేతలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కారు సిద్దమవుతున్నట్టు సమాచారం. తాజాగా వచ్చిన వివరాల ప్రకారం, ఈ విచారణ మళ్లీ కొన్ని పెద్ద పేర్లను వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అన్న టాక్ నడుస్తోంది.. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి..