బస్సు యాత్రతో షర్మిల ఎన్నికల ప్రచారం షురూ..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. నేతలు ఎన్నికల ప్రచార నిమిత్తం పలు రకాల ప్రణాళికలతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఒకరు ఎన్నికల శంఖారావం అంటే.. మరొకరు మేమంతా సిద్ధం అంటున్నారు. ఈ మధ్యలో నేనేమన్నా తక్కువ అంటూ షర్మిల కూడా జనంలోకి రావడానికి రెడీ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతటా బస్సు యాత్ర నిర్వహించడానికి ఆమె సిద్ధపడుతున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తొలి విడత కడప జిల్లాలో 8 రోజులపాటు షర్మిల బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల ప్రజలతో మమేకం అయ్యే విధంగా ఆమె తన షెడ్యూల్ను సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తరఫున కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న షర్మిల మొదట కడపలో.. ఆ తరువాత రాష్ట్రమంతా బస్సు యాత్ర చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. షర్మిల బస్సు యాత్రలో ప్రతిపక్షాలపై ఏ రేంజి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారో చూడాలి మరి.













