రాజశ్యామల యాగం.. అధికార యోగం..?
తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం యాగాలు కామనయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ యాగాలు చేశారు. అవి ఫలించాయో లేదో తెలియదు కానీ రెండు దపాలు సీఎంగా ఎన్నికయ్యారు. లేటెస్టుగా ఎన్నికల ముందు కూడ కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజశ్యామల యాగాలు చేశారు. ఇందులో రేవంత్ విజయం సాధించగా, కేసీఆర్ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఇదే కోవలో ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్ పలుమార్లు ఇదే యాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు లేటెస్టుగా చంద్రబాబు సైతం తన నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు ఇంట్లో రాజ్యశ్యామల యాగం ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 50 మంది రుత్వికుల ఆధ్వర్యంలో యాగం మొదలైంది. మూడు రోజులపాటు జరగనున్న పూజా కార్యక్రమాల్లో తొలిరోజు చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్నికల వ్యూహాల్లో చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు, బిజెపితో పొత్తు చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మూడు రోజులు పాటు రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు.
గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో రిత్వికులు యాగం జరుగుతోంది.. మూడు రోజులపాటు చంద్రబాబు నివాసంలో ఈ యాగక్రతువు కొనసాగునుంది. గత డిసెంబర్ లోనూ చంద్రబాబు నివాసంలో యాగం జరిగింది. అప్పుడు చండీయాగం, సుదర్శన, నరసింహ హోమం నిర్వహించారు. గత ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్ ఇటువంటి హోమాలే నిర్వహించారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ సైతం హోమాలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల యాగం అంటే ముందుగా గుర్తొచ్చేది స్వామి స్వరూపానందేంద్ర. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో సీఎం జగన్ తో చాలాసార్లు స్వరూపనంద స్వామి రాజశ్యామల యాగాలు చేయించారు. వారిద్దరూ అధికారంలోకి రాగలిగారు. అయితే చంద్రబాబు ఇటీవల యాగాలు చేపడుతున్నా..అవి ఆయన స్వగృహంలోనే జరుపుతుండడం విశేషం.













